అదొక రంగురంగుల పక్షి. అందమైన దాని రూపాన్ని చూసి, తియ్యనైన దాని గొంతును విని ముచ్చటపడి దాన్ని ఒక పంజరంలో పెట్టారు. ఒక గిన్నెలో నీరు, మరో గిన్నెలో ధాన్యపు గింజలు వేసి ఉంచారు. పంజరం లోపలే అది కూర్చునేందుకు చిన్న పీట వేశారు. అయితే, ఆ పక్షి ఇవేమీ గమనించే స్థితిలో లేదు. బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న మరో పక్షి మీదనే దాని దృష్టంతా. దాన్ని చూస్తూ, ‘నాకు ఈ పంజరమే ప్రపంచం, ఇక్కడ నాకు ఊపిరి సలపడం లేదు’ అన్న బాధ! దాంతో ఆ పక్షిపై ఈరా‡్ష్య భావాన్ని పెంచుకుంది. ఇంకొక వైపు బయట ఉన్న పక్షి.. ‘ఈ పంజరంలో బంధించి ఉన్న పక్షి ఎంత సుఖంగా ఉంది! దీనికి తిండీ నీరు సంపాదించుకునే కష్టం లేదు. గాలివానల భయం లేదు. వేటాడే పక్షుల నుంచి తప్పించుకునే శ్రమ లేనే లేదు. నాకు మాత్రం ఎప్పుడూ ఆహారం సంపాదించుకోవడం, నీరు తాగడం గురించిన ఆలోచనే. గాలి వానల్లో ఎంతో కష్టంగా ఉంటుంది. చాలాసార్లు గద్దల్లాంటి పక్షుల నుండి రక్షించుకోవటం కష్టమైపోతుంది..’ అని ఆలోచించి తనకు తాను బాధపడుతూ పంజరంలోని పక్షిపైన ఈర‡్ష్య పడసాగింది. విషయమేంటంటే అవి రెండూ తనకన్నా మరో పక్షే ఎక్కువ సుఖంగా ఉన్నట్లు భావిస్తున్నాయి. ఒకవేళ రెండింటి ఆలోచనలు మార్పు చెందితే.. పంజరంలో ఉన్న పక్షి ‘నేను ఎంత సుఖంగా ఉన్నాను. నాకైతే అన్నీ పంజరంలోనే దొరుకుతున్నాయి. కాని పాపం తిండి, నీరు వెదుక్కునే అవస్థ, ప్రతికూల వాతావరణ బాధ, వేటగాళ్ల నుంచి పొంచి ఉండే ప్రమాదం బయట తిరిగే పక్షికి ఎప్పుడూ తప్పవు కదా!’ అని ఆలోచిస్తే బయటి పక్షి మీద అసూయ చెందదు.
బయటి పక్షి.. ‘నేనెంత సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నాను! ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎపుడంటే అప్పుడు వినువీధిలో హాయిగా ఎగరగలను. కానీ, పాపం! ఆ పంజరంలోని పక్షికి ఈ సుఖం ఎప్పటికీ ఉండదు. అస్తమానం దీని ప్రపంచం ఆ పంజరమే కదా!’ అని ఆలోచిస్తే పంజరంలోని పక్షిపై దానికి ఈర్ష్య బదులు సానుభూతి కలుగుతుంది. వాటి ఆలోచనలలో ఈ విధమైన మార్పు వస్తే రెండింటి దృక్పథమూ మారిపోతుంది. మన ఆలోచనలు కూడా ఇక్కడి ఆ పక్షులకన్నా విభిన్నం ఏమీ కాదు. అందరూ తమ తమ పరిస్థితులను అనుకూలంగా, అదృష్టంగా భావిస్తూ, ఇతరుల గురించి సానుభూతిగా ఆలోచిస్తూ, వారి మంచి కోరుకోవడంలోనే తృప్తి, సంతృప్తి ఉన్నాయి.
– డి.వి.ఆర్.
నేనే బాగున్నాను
Published Thu, Jul 19 2018 12:12 AM | Last Updated on Thu, Jul 19 2018 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment