రమల్లా(వెస్ట్ బ్యాంక్): ఇజ్రాయెల్– హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. హమాస్ ముందుగా ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం తెలిసిందే. దీంతో తమ జైళ్లలోని వెస్ట్ బ్యాంక్‌కు చెందిన 90 మంది మహిళలు, చిన్నారులకు సోమవారం ఇజ్రాయెల్ స్వేచ్ఛనిచ్చింది. రెడ్ క్రాస్‌కు చెందిన బస్సుల్లో వచ్చిన వీరికి వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాలో కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మియులు ఘనంగా స్వాగతం పలికారు. ఒక్కసారిగా అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది.
వారిని కొందరు భుజాలపైకి ఎత్తుకోగా మరికొందరు నినాదాలు, ఈలలతో సంతోషం వ్యక్తం చేశారు. ఇంకొందరు ఫతా, హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపుల జెండాలు పట్టుకుని గుమికూడారు. వేడుకలు చేసుకోవద్దంటూ ఇజ్రాయెల్ బలగాలు చేసిన హెచ్చరికలను వారెవరూ పట్టించుకోలేదు. సోమవారం రమల్లాకు చేరుకున్న వారిలో 69 మంది మహిళలు, 21 మంది టీనేజీ బాలురు ఉన్నారు. వీరిలో 12 ఏళ్ల బాలుడు సైతం ఉన్నాడు. ఒప్పందం మొదటి విడతలో హమాస్ 33 మంది బందీలను 42 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ వెయ్యి నుంచి రెండు వేల మంది ఖైదీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment