
ఒప్పందంపై ఇజ్రాయెల్ యూ టర్న్
శాంతిసాధన ప్రక్రియకు విఘాతమే!
రెండో దశ చర్చలకు సిద్ధం: హమాస్
నలుగురు ఇజ్రాయెలీల మృతదేహాల అప్పగింత
600 మంది ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ తొలి దశకు శనివారంతో తెర
ఖాన్ యూనిస్: గాజాలో శాంతిస్థాపన ప్రక్రియ మళ్లీ డోలాయమానంలో పడింది. గాజాలోని ఫిలడెల్ఫీ తదితర వ్యూహాత్మక ప్రాంతాల నుంచి తమ సైన్యం వైదొలగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ గురువారం కుండబద్దలు కొట్టింది. ఆయుధాల స్మగ్లింగ్ తదితరాల నిరోధానికి ఇది తప్పనిసరి పేర్కొంది. నలుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ అధికారి ఒకరు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. దాంతో తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగియనున్న వేళ ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు అనుమానంలో పడ్డాయి.
ఒప్పందం మేరకు ఫిలడెల్ఫీ తదితర ప్రాంతాల నుంచి వైదొలిగే ప్రక్రియకు ఇజ్రాయెల్ శనివారమే శ్రీకారం చుట్టాల్సి ఉంది. చర్చలు ముందుకు సాగాలంటే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాల్సిందేనని హమాస్‌తో పాటు చర్చల మధ్యవర్తి ఈజిప్ట్ కూడా స్పష్టం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. హమాస్ మాత్రం రెండో దశ కాల్పుల విరమణపై చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమ వద్ద బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలు విడుదలవ్వాలంటే చర్చలకు, ఒప్పందానికి కట్టుబడి ఉండటమే ఇజ్రాయెల్ ముందున్న ఏకైక మార్గమని పేర్కొంది.
కాల్పుల విరమణ నుంచి వెనక్కి తగ్గే ఏ ప్రయత్నమైనా బందీలకు, వారి కుటుంబాలకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ చెరలో ఉన్న 600కు పైగా పాలస్తీనా ఖైదీలు కూడా గురువారం తెల్లవారుజామున విడుదలయ్యారు. దాంతో ఖాన్ యూనిస్‌లో ఆనందం నెలకొంది. ఆరు వారాల తొలి దశ కాల్పుల విరమణలో భాగంగా హమాస్ ఇప్పటిదాకా 25 మంది ఇజ్రాయెలీ బందీలను, 8 మృతదేహాలను అప్పగించింది. బదులుగా దాదాపు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.
రెండో దశపై ఫిబ్రవరి తొలి వారంలోనే చర్చలు మొదలవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు. హమాస్ తాజాగా అప్పగించిన నలుగురు ఇజ్రాయెలీల మృతుల్లో ఒకరు 2023 అక్టోబర్ 7న దాడిలోనే చనిపోయారు. మృతదేహాన్ని హమాస్ మిలిటెంట్లు గాజాకు తరలించారు. మిగతా ముగ్గురు సజీవంగా అపహరణకు గురయ్యారు. వారి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. హమాస్ వద్ద కనీసం మరో 59 మంది ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నట్టు చెబుతున్నారు. వారిలో 32 మందికి పైగా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment