మాదాపూర్ ఫైరింగ్‌తో ఉలికిపాటు.. హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్ కల్చర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరుస స్నాచింగులకు పాల్పడి తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన హెడ్–కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచిన కలబురిగి స్నాచర్లు ఇషాన్, రాహుల్ తమ వెంట రెండు తుపాకులు తెచ్చుకున్నారు. ఈ విషయం గురువారం వారిని అరెస్టు చేసిన సందర్భంలో వెలుగులోకి వచ్చింది. సోమవారం మాదాపూర్ ఠాణా పరిధిలోని నీరూస్ చౌరస్తాలో రియల్టర్లుగా మారిన ఇద్దరు నేరచరితుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఇలా రాజధానిలో తరచూ తుపాకీ వినియోగమనేది కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో చిన్న వివాదానికీ తుపాకులు, తూటాలు ‘తెరపైకి’ వస్తున్నాయి. తుపాకులకు సంబంధించిన అత్యధిక నేరాలు అక్రమాయుధాలతోనే జరుగుతున్నాయి. రాజధానిలో ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలకు వాటికి రెండు రెట్లకుపైగా అక్రమ ఆయుధాలు వినియోగంలో ఉన్నాయన్నది అనధికారిక అంచనా. ఇవి అనేక ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అక్కడ కుటీర పరిశ్రమలుగా...
బిహార్, ఉత్తరప్రదేశ్‌ల్లోని అనేక ప్రాంతాల్లో తుపాకుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా సాగుతోంది. నగరానికి సరఫరా అవుతున్న నాటు తుపాకుల్లో దాదాపు 90 శాతం ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఒకప్పుడు కేవలం తపంచాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ‘పరిశ్రమలు’ ఇప్పుడు అత్యాధునికమైనవీ తయారు చేస్తున్నాయి. బిహార్‌లోని ముంగేర్, గయ, యూపీలోని నాన్గల్, హసన్పూర్ తదితర ప్రాంతంలో తయారవుతున్న నాటు తుపాకులకు సేఫ్టీలాక్ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. కేవలం కంపెనీ మేడ్ పిస్టల్స్‌కు మాత్రమే ఇది ఉండేది. ఇక్కడ తయారయ్యే వాటిలో రివాల్వర్లకు సైతం సేఫ్టీ లాక్ ఏర్పాటు చేస్తున్నారు. బిహార్, యూపీల నుంచి నగరానికి సరఫరా అవుతున్న వాటిలో ఆటోమేటెడ్, సెమీ– ఆటోమేటెడ్ రకాలతో పాటు అతి చిన్న సైజులో ఉండే సింగిల్ షార్ట్ గన్స్ కూడా ఉంటున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. కేవలం డిఫెన్స్, పోలీసు శాఖలు మాత్రమే వాడే ప్రొహిబిటెడ్ బోర్‌గా పిలిచే పాయింట్ 9 ఎంఎంలనూ అక్కడి వ్యక్తులు నాటు పద్ధతిలో తయారు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ నాటు ఆయుధాల ‘మెనూ’..
తపంచా: రూ.1000 నుంచి రూ.2 వేలు
రివాల్వర్: రూ.5 వేల నుంచి రూ.10 వేలు
పిస్టల్: రూ.12 వేల నుంచి రూ.15 వేలు
సింగిల్ షార్ట్ గన్: రూ.17 వేల వరకు
ఆటోమేటెడ్ పిస్టల్: రూ.18 వేల నుంచి రూ.20 వేలు
ఆటోమేటెడ్ రివాల్వర్: రూ. 20 వేలకు పైగా
తేలిగ్గా నగరానికి రవాణా..
నగరానికి ఉత్తరాది నుంచి తుపాకులు సరఫరా చేయడానికి ఆయా ముఠాలు ఏమాత్రం కష్టపడట్లేదు. ఈ అక్రమ రవాణా కోసం ప్రత్యేక ముఠాలు కూడా పని చేస్తున్నాయి. వీరికీ రైలు మార్గం ఓ వరంగా మారింది. రైల్వేస్టేషన్లు, జనరల్ బోగీల్లో తనిఖీలు అంతంత మాత్రంగా ఉండటంతో వీటిలోనే ఆయుధాలు రవాణా చేస్తున్నాయి. వీటికి తోడు ట్రాన్స్పోర్ట్ లారీల్లోనూ ఇవి నగరానికి వస్తున్నాయి. ఓ పక్క ముఠాలే కాకుండా... అక్కడ నుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని అదనపు ఆదాయ మార్గంగా భావిస్తున్నారు. పనుల కోసం నగరంలో స్థిరపడిన బిహారీలు రాకపోకలు సాగించే సమయంలో తమతో పాటు కొన్ని ఆయుధాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో ఉన్న అనేక ప్రాంతాల్లో వీటిని విరివిగా అమ్ముతున్నారు.
నిఘా అంతంత మాత్రమే..
ఎప్పటికప్పుడు ఆయుధాలు, వాటిని విక్రయించేందుకు ప్రయత్నించిన, కొనుగోలు చేసిన వారిని పట్టుకుని చేతులు దులుపుకొంటున్న పోలీసులు వీటి మూలాలను కనుక్కోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. సిటీలో అక్రమ ఆయుధ వ్యాపారంపై పోలీసు నిఘా సైతం అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఈ ఆయుధాలు బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చి చేరుతున్నాయని చెబుతున్న అధికారులు అవి వస్తున్న మార్గాలపై మాత్రం కన్నేసి ఉంచలేకపోతున్నారు. ఫలితంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఓ ముఠా దొరికినప్పుడు వారిని అరెస్టు చేయడంతో సరిపెట్టాల్సి వస్తోంది. ఎవరైనా చొరవ తీసుకుని కాస్త ముందడుగు వేసి దర్యాప్తు కోసం రాష్ట్రం దాటినా... వారికి అక్కడి పోలీసుల నుంచి సరైన సహకారం అందుతుందని ఆశించలేం. ఒక్కోసారి ఎదురుదాడులు జరిగే పరిస్థితి ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తి ఉన్న అధికారులు సైతం మిన్నకుండి పోవాల్సి వస్తోంది.
చదవండి: మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి