ఐసిస్ చెర నుంచి సురక్షితంగా..
14 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బయటపడిన తెలుగు ప్రొఫెసర్లు
తీవ్రవాద స్థావరాలపై భద్రతా దళాల దాడితో విముక్తి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/టెక్కలి : 14 నెలల కిందట ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా చిక్కుకున్న హైదరాబాద్‌కు చెందిన తెలుగు ప్రొఫెసర్లు చిలువేరు బలరాంకిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తమ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి తాము క్షేమంగా విడుదలయ్యామని, ప్రస్తుతం మిలటరీ రక్షణలో ఉన్నామని చెప్పారు. లిబియాలోని ట్రిపోలీకి 250 కి.మీల దూరంలో ఉన్న తాము భారత దౌత్య అధికారులను కలిశాక హైదరాబాద్ వస్తామన్నారు. వారిద్దరు సోమ లేదా మంగళవారాల్లో హైదరాబాద్ వచ్చే వీలుంది. ఊహించని రీతిలో గోపికృష్ణ, బాలరాం కిషన్ తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేయటంతో ఆ రెండు కుటుంబాలు ఆనందంలో మునిగి తేలాయి. తమవారి విడుదలకు క ృషి చేసిన ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి వెంకయ్య, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇండియాకొస్తూ ఐసిస్ చెరలోకి..
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గోపీకృష్ణ, కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ చిలువేరు బలరాంల కుటుంబాలు నగరంలోనే స్థిరపడ్డాయి. గోపీ భార్యపిల్లలు నాచారంలో, బలరాం భార్యాపిల్లలు ఆల్వాల్‌లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా లిబియాలో పనిచేస్తూ, స్వస్థలానికి తిరిగి వస్తున్న క్రమంలో 2015 జూలై 29న ట్రిఫోలి సమీపంలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.
దీంతో గోపీ భార్య కళ్యాణి, పిల్లలు జాహ్నవి, సాయికుమార్.. బలరాం కిషన్ భార్య శ్రీదేవి, పిల్లలు విజయభాస్కర్, మధుసూదన్ అనేక మార్లు కేంద్రమంత్రులు, మోదీని కలిసి విజ్ఞాపనలు చేశారు. ఇటీవల లిబియా దేశంలో అమెరికా సైనికులు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట వీరు బందీలుగా ఉన్న స్థావరాలపై దాడులు చేయగా, వీరు సురక్షితంగా బయట పడినట్లు సమాచారం.
గోపీ ఇంట్లో ఆనందం...
‘నేను గోపీకృష్ణను మాట్లాడుతున్నా. ఉగ్రవాదుల చేర నుంచి బయటపడ్డా. నేను క్షేమంగా ఉన్నా. మీరు క్షేమంగా ఉన్నారా?’ అంటూ గోపీకృష్ణ తన భార్య కళ్యాణితో బుధవారం అర్థరాత్రి ఫోనులో మాట్లాడారు. తాను అమెరికాకు చెందిన బలగాల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది. గురువారం ఉదయం కళ్యాణి తన పిల్లలతో కలిసి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘గోపీ క్షేమంగా ఉన్నాడన్న వార్త మా కుటుంబంలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఇది అతడికి పునర్జన్మగా భావిస్తున్నాం’ అన్నారు. బుధవారం రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ తన భార్యతో పాటు తండ్రి నారాయణరావుతోనూ మాట్లాడినట్లు తెలిపారు.
భర్త పలకరింపుతో ఉద్వేగానికి గురైన శ్రీదేవి: ‘హలో... శ్రీదేవి నేను బలరాంను మాట్లాడుతున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు?’ అంటూ తెలియని నంబర్ నుంచి బుధవారం అర్ధరాత్రి వచ్చిన ఫోన్‌లో ఉద్వేగపూరితమైన గొంతుతో పలకరింపు ఇది. దీంతో ఒక్కసారిగా మూగబోరుున శ్రీదేవి గొంతు సంతోషంతో బదులిచ్చింది. తన భర్త దాదాపు అర నిమిషం సేపు అక్కడి సైన్యం ఇచ్చిన ఫోన్ ద్వారా తనతో మాట్లాడారని ఆమె చెప్పారు. ఇన్నాళ్లు అధికారులు, సహ ఉద్యోగులు బలరాం క్షేమంగా ఉన్నాడంటూ చెప్తున్నప్పటికీ గుబులుతోనే ఉన్న శ్రీదేవి మొఖంలో నిమజ్జనం రోజు ఆనందం వెల్లివిరిసింది. దీంతో ఇంటిల్లిపాదీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టెక్కలిలో సంబరాలు
గోపికృష్ణ ఉగ్రవాదుల చెర నుంచి బయట పడినట్లు సమాచారం రావడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నివాసముంటున్న ఆయన తల్లిదండ్రులు వల్లభ నారాయణరావు, సరస్వతి, అమ్మమ్మ మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే హైదరాబాద్ బయల్దేరుతామని ‘సాక్షి’కి చెప్పారు.
సంకీర్ణ దళాలు కాపాడాయి: సుష్మా
లిబియాలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ఇంజినీర్లను రక్షించినట్లు విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం ట్వీటర్‌లో తెలిపారు. ఐసిస్‌తో పోరాడుతున్న సంకీర్ణ బలగాలు సిర్త్ పట్టణంలో ఉగ్రవాదుల చెర నుంచి వీరిని విడిపించాయని.. ఇద్దరు ఇంజనీర్లూ క్షేమంగా ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ మీడియాకు తెలిపారు. అయితే డాక్టర్ రామమూర్తి ఇంకా ఉగ్రవాదుల చెరలో బందీగానే ఉన్నారని.. ఆయనను విడిపించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలుగు ఇంజినీర్లు ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం అధికారులు మాట్లాడించారని ఆయన వివరించారు.
మాకిది..మరో జన్మ
‘నెలలు గడిచాయి. ఆయన తప్పక తిరిగి వస్తారన్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపించింది. మాకిది పునర్జన్మ. నా భర్త క్షేమంగా విడుదలయ్యానని ఫోన్ చేశాడు. ఈ 14 నెలలు నరకయాతన అనుభవించాము. దేవుని దయకు తోడు, ప్రధాని, సుష్మాస్వరాజ్ ప్రయత్నాలు ఫలించాయి. అందరికీ ధన్యావాలు. - కళ్యాణి(గోపీకృష్ణ భార్య)
మా పూజలు ఫలించాయి
‘మా వారి కోసం నేను చేయని పూజ, వ్రతం లేదు. వాటన్నింటికి తోడు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రయత్నాలు కలిసి రావటంతో నా భర్త క్షేమంగా తిరిగొస్తున్నారు. మంచివాళ్లకు మంచే జరుగుతుందన్న విశ్వాసమే నన్ను, నా పిల్లల్ని ముందుకు నడిపింది. గాడ్ ఈజ్ గ్రేట్.’
- శ్రీదేవి(బలరాం భార్య)