ముగ్గురు బందీలను వదిలేసిన హమాస్
డెయిర్ అల్ బాలాహ్ (గాజా): పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. శ్మశాన సదృశంగా కన్పిస్తున్న గాజా వీధుల్లో ఎట్టకేలకు శాంతిపవనాలు వీచాయి. (Israel),ఇజ్రాయెల్, (Hamas)హమాస్ మధ్య విరమణ ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా ఆదివారం ఉదయం 11.30కు అమల్లోకి వచ్చింది.
విడుదల చేయబోయే తమ బందీల జాబితాను హమాస్ వెల్లడించేదాకా (ceasefire agreement)కాల్పుల విరమణ అమల్లోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టడంతో తొలుత ఆందోళన నెలకొంది.
జాబితా విడుదలను హమాస్ ఆలస్యం చేయడం ఉత్కంఠకు దారితీసింది. ఉదయం 11.15కు రోమీ గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరోన్ స్టెయిన్‌బ్రీచర్ (31) అనే ముగ్గురు మహిళలను హమాస్ వదిలేస్తున్నట్టు హమాస్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇజ్రాయెల్ బలగాలు వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించాయి. బదులుగా ఇజ్రాయెల్ కూడా తొలి దఫాలో 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది.
వారిని సురక్షితంగా గాజా చేర్చేందుకు రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌లోని ఓఫెర్ కారాగానికి చేరుకుంది. ఆరువారాల్లో హమాస్ 33 మంది, ఇజ్రాయెల్ దాదాపు 2,000 మంది ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వ భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి వైదొలగింది. ఆ పారీ్టకి చెందిన ముగ్గురు నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
గాజాలో ఆనందోత్సాహాలు
కాల్పుల విరమణతో గాజా స్ట్రిప్‌లో ఆనందం వెల్లివిరిసింది. వలస వెళ్లిన పాలస్తీనియన్లు భారీగా గాజాకు తిరిగొస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం దాకా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగింది. దాంతో ఆదివారం ఒక్క రోజే 26 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment