Lockdown: ‘ఫలం’ దక్కలే | Lockdown Affected Gardens Fruit Crops | Sakshi
Sakshi News home page

పంటలపై ‘లాక్‌డౌన్‌’ పిడుగు

Published Mon, May 24 2021 3:19 AM | Last Updated on Mon, May 24 2021 3:33 AM

Lockdown Affected Gardens Fruit Crops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుచ్చ, అరటి, జామ, కర్బూజా, బత్తాయి, దానిమ్మ.. ఇవి అందరూ ఇష్టంగా తినే పండ్లే. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి బాగా డిమాండ్‌ కూడా ఉంది. ఇవి దాదాపుగా నిత్యావసరాల జాబితాలో చేరిపోయాయన్నా అతిశయోక్తి కాదు. అయినప్పటికీ.. రాష్ట్రంలో ఈ పంటలు పండించిన రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.

అడ్వాన్సు కొనుగోళ్లేవీ..
రాష్ట్రంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణం దాదాపు 4.5 లక్షల ఎకరాలు కాగా ఇందులో ఒక్క మామిడి తోటలే 3,17,591 ఎకరాల్లో ఉన్నాయి. బత్తాయి 63,479 ఎకరాల్లో ఉండగా మిగతావి పుచ్చ, జామ, బొప్పాయి, కర్బూజ వంటి ఇతర పంటలు. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన.. అకాల వర్షాలకు తోడు లాక్‌డౌన్‌ ఉద్యాన రైతుల్ని అష్టకష్టాల పాలు చేస్తోంది. పంటలను అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణ పరిస్థితుల్లో వ్యాపారులే తోటల వద్దకు వచ్చి ముందస్తు అడ్వాన్సులిచ్చి మరీ కొనుగోళ్ల జరిపేవారు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటం, కేవలం 4 గంటల సడలింపు మాత్రమే ఉండటంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది.

రవాణాలో ఇబ్బందులు, కష్టనష్టాల కోర్చి ఎలాగో మార్కెట్‌కు తెచ్చినా సరైన ధర లేక, తక్కువ సమయం కావడంతో హడావుడిగా అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి కొనే నాథుడు కూడా లేకపోవడంతో తెచ్చిన పంటను అక్కడే వదిలేసి పోతున్నారు. కాగా వేసవి సీజన్‌లో వచ్చే మామిడి పరిస్థితి మరీ దయనీయంగా మారగా.. లాక్‌డౌన్‌ కారణంగా శుభకార్యాలకు చాలావరకు బ్రేక్‌ పడటంతో పూలు సాగు చేసిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి, దిక్కుతోచని పరిస్థితుల్లో పూల తోటల్లో గొర్రెలు, మేకల్ని మేపుతున్నారు. కూరగాయల రైతులు కూడా కొనే దిక్కులేక చేళ్లను పశువులకు వదిలేశారు. గత ఏడాది కరోనా దెబ్బతోనే ఇప్పటికీ కోలుకోలేని రైతులు, తాజా లాక్‌డౌన్‌తో మరింత నష్టాల్లో కూరుకుపోతున్నారు.

తప్పని కూర‘గాయాలు’
ఈ ఫొటోలో పాలకూర చేనులో బర్రెలను మేపుతున్న రైతు కత్తి గోవిందరెడ్డి. ఇతనిది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ముసలమ్మచెట్టుస్టేజీ గ్రామం. తనకున్న మూడు ఎకరాల్లో వంకా య, టమాట, దోస, గోరు చిక్కుడుతో పాటు పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు వేశాడు. మొ త్తం రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేశాడు. వేసవికాలంలో ఆకుకూరలు, కూరగాయలకు రేటు బాగానే ఉంటుందని భావించినా.. పంట చేతికి వ చ్చిన దశలో లాక్‌డౌన్‌ పుణ్యమా అని కూరగాయలు కొనే దిక్కులేకుండా పోయింది.

టమాట కిలో రూ. 3, వంకాయలు రూపాయి, దోస రూ.4 కు అమ్ముతామన్నా వ్యాపారులు తీసుకోలేదు. లాక్‌డౌన్‌లో దుకాణాలు తెరిచేందుకు సమయం తక్కువగా ఉం డటమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అమ్ముడుపోకుంటే కూరగాయలు చెడిపోతాయని అంటున్నారు. దీంతో గోవిందరెడ్డి సాగు చేసిన పం టలన్నీ చేనుపైనే వదిలేసి బర్రెలను మేపుతున్నాడు. 

పూలు.. గగ్గోలు
ఈ ఫొటో చూస్తే పూలతోటలా ఉంది.. గొర్రెలు మేస్తున్నాయేంటి అనుకుంటున్నారా? అవును గొర్రెలు మేస్తోంది పూలే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కాశీంబౌలి గ్రామానికి చెందిన మునుగాల జంగారెడ్డి.. అర ఎకరంలో బంతి, మరో అర ఎకరంలో జర్మనీ పూలు సాగు చేశాడు. బంతి నారుకు రూ.3కు ఒక మొక్క చొప్పున 8 వేల మొక్కలకు రూ.24 వేలు ఖర్చు పెట్టాడు. ఎరువులు, మందులు, కలుపు కూళ్లకు మరో రూ.15 వేల వరకు ఖర్చయింది. ఇక జర్మనీ విత్తనాలు ఇంటి దగ్గరే వేశాడు. దీనికి మందులు, ఎరువులు, కలుపుకూళ్లు రూ.10 వేల వరకు ఖర్చయ్యింది. సరిగ్గా పూలు కోసే సమయంలోనే కరోనా ఎక్కువైందని లాక్‌డౌన్‌పెట్టారు. మార్కెట్‌ రెండు మూడు గంటలే నడుస్తుండటంతో పూలు కొనేవాళ్లే లేకుండా పోయారు.

పది రోజుల క్రితం ఒకసారి బంతిపూలు తీసుకుని హైదరాబాద్‌ మార్కెట్‌కు వెళ్తే ఒక్క కిలోకూడా అమ్మకపోవడంతో అక్కడే పారబోసి వచ్చాడు. కూరగాయలైతే గ్రామాల్లోనైనా తిరిగి అమ్ముకునే అవకాశం ఉండేది. కానీ పూల విక్రయానికి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌కే వెళ్లాలి. నగర శివారు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఇక్కడికి పూలు తెస్తారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే కొనసాగుతోంది. సుమారు రూ.50 వేలు ఖర్చుపెట్టి పూలు సాగుచేస్తే ఒక్క రూపాయి కూడా రాలేదు. చేసేదేమీలేక పూలతోటలో గొర్రెలు వదలిపెట్టాడు. పోయినేడు కూడా లాక్‌డౌన్‌తో పూలు సరిగా అమ్మలేదని, ఈసారి మే, జూన్‌ నెలల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు పూల డిమాండ్‌ ఉంటుందనుకుంటే ఇలా అయ్యిందని జంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

డిమాండ్‌ కొరవడిన అంజీర.. 
ఈ రైతు పేరు ధనేశ్వర్‌రెడ్డి. జోగుళాంబ గద్వా ల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నెకు చెందిన ఇతను 16 ఎకరాల్లో అంజీర తోట సాగు చేశాడు. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజూ 800 కేజీల నుంచి 1,000 కేజీల వరకు హైదరాబాద్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ నుంచి ఆర్డర్‌ పెట్టేవారు. లాక్‌డౌన్‌తో కొనుగోళ్లు లేవని, 50 నుంచి 100 కేజీలే పంపమని చెబుతుం డటం దిక్కుతోచడంతో లేదు. లాక్‌డౌన్‌కు ముందు కేజీ ధర రూ.120 ఉండేది, ప్రస్తుతం రూ.100 నిర్ణయించారు. కూరగాయలు తరలించే ఆటోలో వంద కేజీలు పంపుతున్నాం. మిగతా పండ్లు మాగినా కో యకపోవడంతో పురుగులు పడుతున్నాయి. పురుగుల వల్ల తోట దెబ్బతింటుందని రోజుకు 25 మం ది కూలీలతో పండ్లు తెంపి పారబోస్తున్నాం. పది రోజులు లాక్‌డౌన్‌ అనుకుంటే ఇప్పుడు నెలాఖరు వరకు పొడిగించారు. మా పరిస్థితి దారుణంగా వుంది. రోజుకు కూలీలకు రూ.పది వేలు ఖర్చువుతోంది. వచ్చే ఆదాయం ఆటోకు, కమీషన్‌ పోను కూలీలకు సరిపోవడం లేదు. పరిస్థితి ఇలా కొనసాగితే పొలాలు అమ్ముకోవాల్సిందేనని ధనేశ్వర్‌రెడ్డి వాపోతున్నాడు. 

కర్బూజ.. ఏక్‌ కహానీ
ఇతని పేరు రమేష్‌. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర గ్రామం. రెండున్నర ఎకరాలలో తెల్ల కర్బూజ, కీరదోస వేశాడు. రూ.1.80 లక్షలు ఖర్చు చేశాడు. పంట అమ్మగా తిరిగి చేతికి రూ.1.10 లక్షలు మాత్ర మే వచ్చాయి. అంటే రూ.70 వేలు నష్టపోయాడన్నమాట. లాక్‌డౌన్‌ కారణంగా వ్యా పారులు కొనేందుకు ముందుకు రాలేదని, తామే అష్టకష్టాలు పడి నిజామాబాద్, ఇతర మార్కెట్లకు వెళ్లి అమ్ముకున్నామని చెప్పాడు. చివర్లో రవాణా ఖర్చులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన పంటను దున్నేశానని వాపోయాడు.

గుమ్మడి కాయకు కష్ట కాలం!
సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని ఆయా గ్రామాల్లో రైతులు సుమారు వంద ఎకరాల్లో గుమ్మడికాయ సాగు చేశారు. మామూలుగా అయితే హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్ముకునేవారు. ఏ శుభకార్యానికైనా గుమ్మడికాయ కొట్టడం ఆనవాయితీ. ఇలా గుమ్మడికీ ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. కానీ ఇప్పుడు వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు అంతగా లేకపోవడంతో పంట అమ్ముడు పోవడం లేదు. దీంతో కోతకు వచ్చిన గుమ్మడి కాయలను రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. ‘ఎకరాకు సుమారు పదిహేను వేల చొప్పున ఖర్చు చేసి రెండెకరాల్లో గుమ్మడికాయ పంట సాగు చేశా. ప్రస్తుతం కొన్ని కోసి సిద్ధంగా ఉంచా. కానీ కొనేందుకు ఎవరూ రావడం లేదు. పొలంలో ఇంకా కాయలున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి..’అని గుమ్మడిదలకు చెందిన రైతు రవీందర్‌రెడ్డి 
కోరుతున్నారు.

రేటు దక్కని అరటి
రెండెకరాల్లో అరటి పంట వేశా. ఇప్పటివరకు రూ.1,50,000 పెట్టుబడి అయింది. లాక్‌డౌన్‌ లేకుంటే ఈ సీజన్‌లో సుమారుగా రూ.4 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉండేది. కానీ వ్యాపారులు.. అరటిపండ్లు తక్కువగా అమ్ముడు పోతున్నాయంటూ మా దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గతంలో అరటికాయలు కిలోకు రూ.13– 16 ధర పలకగా, ఇపుడు రూ.5–6 మాత్రమే పలుకుతోంది. దీనికి తోడు అకాల వర్షాలతో అరటి చెట్లు పడిపోయి గెలలు దెబ్బతింటున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
– హింగే నాగేశ్వర్‌రావు, దామెర, వరంగల్‌ రూరల్‌ జిల్లా

బొప్పాయికి తప్పని తిప్పలు
నాకున్న రెండున్నర ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేసిన. కలుపుతీత కోసం కూలీలకే ఇప్పటివరకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చయ్యింది. పూతకు వచ్చినప్పటి నుంచి రెండు సార్లు మందులు పిచి కారీ చేసిన. ఇలా ఇప్పటివరకు మొ త్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పె ట్టిన. పంట కోతకు వచ్చిన సమయంలో లాక్‌డౌన్‌ వచ్చి పడింది. రవాణా సౌకర్యం లేదంటున్నారు. స్థానికం గా అమ్ముకుంటే ఏమొస్తుందో ఏమో.– నర్సయ్య, రైతు

20 శాతం పంటలకు నష్టం
జనగామ జిల్లాలో రైతులు 15 వేల ఎకరాల్లో మామిడి, కూరగాయలు, బొప్పాయి, జామ తదితర పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, గాలి దుమారంతో 20 శాతం మేర పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇందులో మామిడి 950 ఎకరాల్లో, బొప్పాయి 150 ఎకరాల్లో , కూరగాయలు 2 వేల ఎకరాల్లో 15 నుంచి 20 శాతం మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నాం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలను పంపిస్తాం. లాక్‌డౌన్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం.
– కేఆర్‌ లత, హార్టికల్చర్‌ ఆఫీసర్, జనగామ


ఇబ్బందులు వాస్తవమే..
ఉద్యాన ఉత్పత్తుల విక్రయాలకు లాక్‌డౌన్‌ కొంత ఇబ్బందిగా మారిన విషయం నిజమే. ప్రతిరోజూ మార్కెట్‌కు పుచ్చతో పాటు ఇతర పండ్లు వస్తున్నాయి. మార్కెట్‌లో పండ్లు అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని రైతుల నుంచి ఫిర్యాదులు రాలేదు. అయితే మే మాసంలో కోతకు వచ్చేలా పంటలు సాగు చేసిన వారుంటే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. సడలింపు సమయం తక్కువ కావడంతో కూరగాయలు, ఆకుకూరలు మాత్రం పూర్తి స్థాయిలో విక్రయించుకోలేక పోతున్నారు. 
– శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా


పంట పేరు:    పుచ్చ
సాగుచేసిన విస్తీర్ణం:    మూడు ఎకరాలు
పెట్టుబడి:    రూ.2.10 లక్షలు
నష్టం:    రూ.5 లక్షలు

ఇదీ పుచ్చ సాగు వ్యయాల లెక్క. నలిమెల ప్రవీణ్‌రెడ్డి (ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం పొచ్చెర) రెండేళ్లుగా యాసంగి పంటగా పుచ్చ సాగుచేస్తున్నాడు. గతేడాది ఆరెకరాల్లో సాగుచేయగా, పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్‌తో లాభాలకు తాళంపడింది. అప్పట్లో ఊరూరా తిరిగి ఒక్కో కాయను రూ.10 చొప్పు న అమ్మి కొంత సొమ్ము చేసుకున్నాడు. ఈసారి లాక్‌డౌన్‌ కఠిన నిబంధనలతో ఆ అవకాశమూ లేకపోయింది. పైగా ధర లేదు. వ్యాపారులూ కొనుగోలుకు రాలేదు. కూలీలతో కాయలు కోయించి విక్రయిద్దామంటే కూలీ డబ్బులైనా వస్తాయో రావోనని మూడెకరాల్లోని పంట మొత్తం వదిలేశాడు. అన్నీ సవ్యంగాజరి గుంటే.. పెట్టుబడి పోను రూ.3 లక్షల లాభం  మూటగట్టుకునే వాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement