షరీఫ్ కొత్త పల్లవి! | Nawaz Sharif's new strategy on ceasefire | Sakshi
Sakshi News home page

షరీఫ్ కొత్త పల్లవి!

Published Tue, Oct 22 2013 12:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

Nawaz Sharif's new strategy on ceasefire

భారత, పాకిస్థాన్ ప్రధానుల మధ్య చర్చలు జరిగి 20 రోజులై ంది. దానికి సంబంధించి ఇంతవరకూ పురోగతి ఏమాత్రం లేదు. ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) ఎప్పుడు సమావేశం కావాలన్న అంశంపై తదుపరి చర్చలు లేవు. ఈలోగా ఎప్పట్లాగే పాక్ వైపునుంచి అడపా దడపా కాల్పుల విరమణ ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 10రోజుల్లో దాదాపు 36సార్లు ఇలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఇరుదేశాల ప్రధానుల చర్చలకు చాలాముందే ఇవి మొదలయ్యాయి. ఒకటి రెండు రోజుల విరామం మినహా నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ ఎన్నికలకు ముందూ, ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించాక భారత్‌తో స్నేహం గురించి నవాజ్ షరీఫ్ చాలా మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారం పెంచుకుంటామని, సరిహద్దు తగాదాలకు శాంతియుత పరిష్కారం సాధనకు కృషిచేస్తామని చెప్పారు.
 
 ఈ మూడున్నర నెలల పాలనాకాలంలో మాత్రం అందుకు సంబంధించిన జాడలు కనబడనేలేదు. సరిగదా సరిహద్దుల్లో కొత్తగా ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. అందుకు సంజాయిషీ ఇవ్వాల్సిన సమయంలో షరీఫ్ ఇప్పుడు కొత్త స్వరం వినిపించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా మధ్యవర్తిత్వం కావాలని ఆయన కోరారు. రెండు దేశాల ప్రధానులు చాలా కాలం తర్వాత చర్చించుకున్నారని, అందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, పర్యవసానంగా స్నేహసంబంధాలు పెరగడానికి ఆస్కారం ఉన్నదని ఆశించేవారికి షరీఫ్ ఇలా అడ్డం తిరగడం ఆశ్చర్యమూ, అసంతృప్తి కలిగిస్తాయి. నిజానికి షరీఫ్ మాటలు కొత్తవేమీ కాదు. పాకిస్థాన్‌లో అధికార పీఠంపై ఉన్న ప్రతి ఒక్కరూ గత ఆరున్నర దశాబ్దాలుగా ఈ మాటలే వినిపిస్తున్నారు. సమస్యను ఎలాగైనా అంతర్జాతీయం చేసి ఏదోరకంగా తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని చూస్తున్నారు. క్రితంసారి ప్రధానిగా పనిచేసినప్పుడు కూడా షరీఫ్ ఇలాంటి మాటలే మాట్లాడారు. ఆ సంగతి ఆయనే చెబుతున్నారు. 1999లో అమెరికా పర్యటించినప్పుడు అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముందు ఇలాంటి ప్రతిపాదనే పెట్టానంటున్నారు. అమెరికా పశ్చిమాసియా సమస్యపై వెచ్చించే సమయంలో 10 శాతం కాశ్మీర్ సమస్యపై కేంద్రీకరిస్తే అది సులభంగా పరిష్కారమవుతుందని క్లింటన్‌కు ఆయన చెప్పారట. అయితే, ఇలా మూడో పక్షం జోక్యం చేసుకోవడం భారత్‌కు నచ్చదని కూడా ఆయనకు తెలుసట.
 
 ప్రధాని పదవి చేపట్టాక నవాజ్ షరీఫ్ అమెరికాలో చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇది. ఈ పర్యటనకు ముందే, లండన్‌లో ఆగిన సందర్భంలో షరీఫ్ ‘మూడో పక్షం’ జోక్యం ప్రతిపాదన చేశారు. వాస్తవానికి తాను మన్మోహన్‌తో మాట్లాడినప్పుడు ఏ నిర్ణయాలు జరిగాయో, అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో చూసి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తాము అనుకున్నదానికి భిన్నంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు కొనసాగుతున్నాయో ఆరా తీయాల్సి ఉంది. కానీ, అవేమీ చేయకపోగా ఇలా పాత ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇందువల్ల షరీఫ్ ఆశిస్తున్నదేమిటో స్పష్టమే. దీనిద్వారా ఆయన తన చేతగానితనాన్ని దాచుకోవాలని చూస్తున్నారు. దేశ ప్రధానిగా ఆ చర్చల్లో తాను ఇచ్చిన హామీలకు తన సైన్యమే తూట్లు పొడుస్తుంటే, వారిని వారించలేక ఆయన  ఇలా సమస్యను పక్కదోవపట్టించాలని చూస్తున్నారు.  కానీ, ఆ విషయంలో ఆయన విజయం సాధించలేకపోయారు. అమెరికా వెళ్తూ లండన్‌లో ఆగినప్పుడు షరీఫ్ ఈ ప్రతిపాదన చేయగా ఆయనింకా ఒబామాతో సమావేశం కాకుండానే అమెరికా దీన్ని చెత్తబుట్టలో వేసింది. ద్వైపాక్షిక సమస్యలపై ఆ రెండుదేశాలే చర్చించుకోవాలని, ఆ చర్చల ఉరవడి, పరిధి,స్వభావమూ ఎలా ఉండాలో అవే తేల్చుకోవాలని అమెరికా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికైనా తన ప్రతిపాదనలోని తెలివితక్కువతనం ఆయనకు తెలిసిందో, లేదో?!
 
  అమెరికా జోక్యానికి షరీఫ్ కొన్ని కారణాలను చూపుతున్నారు. ఈ ఆరున్నర దశాబ్దాలుగా ఇరుదేశాలమధ్యా ఆయుధపోటీ పెరిగిందని, ఇరుపక్షాలూ పోటాపోటీగా క్షిపణులనుంచి అణ్వస్త్రాల వరకూ సమకూర్చుకున్నాయని, ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నదని షరీఫ్ అన్నారు. అంతా నిజమే. కానీ కారకులెవరు? చర్చల్లో తీసుకుంటున్న నిర్ణయాలను కాలరాస్తున్నదెవరు? తాము దృఢంగా వ్యవహరించి, తమ సైన్యం వైపుగా తప్పిదాలు జరగకుండా చూస్తే సామరస్యపూర్వక పరిష్కారం లభించడం అంత కష్టమా? కానీ, ఎప్పుడూ చర్చల దారి చర్చలది...తమ వైఖరి తమది అన్నట్టే పాకిస్థాన్ వ్యవహరిస్తున్నది. ఇప్పుడు షరీప్ తెచ్చిన ‘మూడో పక్షం జోక్యం’ ప్రతిపాదననే తీసుకుంటే...అది ఇరుదేశాల మధ్యా నాలుగు దశాబ్దాలక్రితం కుదిరిన సిమ్లా ఒప్పందానికి పూర్తి విరుద్ధం. 
 
 ద్వైపాక్షిక సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని, మూడో పక్షం జోక్యాన్ని కోరవద్దని ఆ ఒప్పందంలో ఇరు దేశాలూ అంగీకరించాయి. ఇప్పుడు దాని స్ఫూర్తికి విరుద్ధంగా షరీఫ్ వ్యవహరిస్తున్నారు. పాత ఒప్పందాలపై ఖాతరులేక, తాజా చర్చల్లో తీసుకున్న నిర్ణయాలపై గౌరవంలేక తోచినట్టు  మాట్లాడే ఇలాంటి ధోరణి సమస్య పరిష్కారానికి ఏమాత్రం దోహదపడదని షరీఫ్ గుర్తిస్తున్నట్టు లేరు. సరిహద్దులు ప్రస్తుతం చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. కాల్పులు జరగని రోజంటూ లేదు. ఇప్పటికివి స్వల్ప ఘర్షణలుగా కనిపిస్తున్నా...భవిష్యత్తులో మరింత ముదురుతాయనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయంలోనూ, గద్దెనెక్కిన తర్వాత తానిచ్చిన హామీలేమిటో, వాటిని అమలు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులేమిటో షరీఫ్ చిత్తశుద్ధితో ఆలోచించాలి. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో అన్వేషించాలి. అంతేతప్ప పరిస్థితిని మరింత జటిలం చేసేలా వ్యవహరించకూడదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement