* భారత్‌పై పాక్ ఎన్‌ఎస్‌ఏ విమర్శ
* తమదీ అణ్వస్త్ర దేశమేనని వ్యాఖ్య
ఇస్లామాబాద్: భారత దేశం ప్రాంతీయ అగ్రరాజ్యం తరహాలో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)సర్తాజ్ అజీజ్ ధ్వజమెత్తారు. ఉఫా ఒప్పందాన్ని అతిక్రమిస్తూ భారత్ తన ఎజెండాను రుద్దుతోందని.. దానివల్లే ఎన్‌ఎస్‌ఏ చర్చలు రద్దయ్యాయని ఆరోపించారు. డాన్ వార్తా పత్రిక సోమవారం ప్రచురించిన కథనం ప్రకారం.. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ..
భారత్‌ను ప్రాంతీయ అగ్రరాజ్యంగా పరిగణిస్తున్నారు. మోదీ సారథ్యంలోని భారత్ ప్రాంతీయ అగ్రరాజ్యంగా వ్యవహరిస్తోంది. కానీ మాదీ అణ్వస్త్ర శక్తిగల దేశమే.. మమ్మల్ని రక్షించుకోవటం ఎలాగో మాకు తెలుసు’ అని అజీజ్ అన్నారు. కశ్మీర్ అనేది ఒక అంశం కానట్లయితే.. ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ 7 లక్షల మంది సైనికులను ఎందుకు మోహరించిందని ప్రశ్నించారు.
‘‘రెండు దేశాల మధ్య కశ్మీర్ అనేది ఒక సమస్య అని, దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సమాజం యావత్తూ విశ్వసిస్తోంది.కశ్మీర్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు వీలు కల్పిస్తూ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణను భారత్ నిర్వహించాలి’’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై చర్చల నుంచి పాక్ పారిపోదని.. ఎందుకంటే పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించటంలో భారత గూఢచర్య సంస్థ ‘రా’ ప్రమేయంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఆంక్షలు కొనసాగిస్తే.. చర్చలు అసాధ్యం
భారత్-పాక్‌ల ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలు రద్దయినప్పటికీ.. సెప్టెంబర్ 5-6 తేదీల్లో జరగాల్సివున్న భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల సమావేశం షెడ్యూలు ప్రకారం జరుగుతుందని అజీజ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే.. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ అయిన హురియత్ కాన్ఫరెన్స్ నేతలతో పాక్ నేతలు కలవకూడదని భారత్ ఆంక్షలు విధించటం కొనసాగిస్తే.. ఎటువంటి చర్చలూ సాధ్యం కాదని అని ఓ టీవీ చానల్‌తో అన్నారు.
ప్రాంతీయ అగ్రరాజ్యంలా..
Published Tue, Aug 25 2015 3:41 AM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM
Advertisement