మళ్లీ తనిఖీలకు ఆదేశాలివ్వడం సరికాదు
♦ ‘వైద్యకళాశాలల్లో అదనపు సీట్ల మంజూరు’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
♦ ‘మిమ్స్’ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన ధర్మాసనం
♦ ఓసారి ఎంసీఐ తనిఖీల తరువాత మళ్లీ తనిఖీలకు ఆదేశాలివ్వరాదు
♦ మిమ్స్‌లో మరోసారి తనిఖీలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య కళాశాలల్లో అదనపు సీట్ల మంజూరు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఒకసారి సంబంధిత కాలేజీలో తనిఖీలు నిర్వహించి అదనపు సీట్ల మంజూరుకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కాలేజీలో సౌకర్యాలు లేవని తేల్చినప్పుడు... అదే అంశంపై మళ్లీ తనిఖీల నిర్వహణకోసం ఆదేశాలివ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(మిమ్స్-హైదరాబాద్)కు 50 అదనపు సీట్లు మంజూరు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. 50 అదనపు సీట్ల మంజూరుకు సంబంధించి మిమ్స్‌లో మరోసారి తనిఖీలు నిర్వహించాలంటూ ఎంసీఐని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేసింది.
ఒకసారి తనిఖీలు నిర్వహించి అదనపు సీట్ల మంజూరుకు మిమ్స్‌కు అర్హత లేదని ఎంసీఐ తేల్చినప్పుడు.. మరోసారి తనిఖీలకు ఆదేశాలు జారీచేయడం చట్టపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఉన్నత ప్రమాణాల్ని నిర్దేశించి దేశంలో వైద్యవిద్యను పర్యవేక్షిస్తున్న అత్యున్నత సంస్థ(ఎంసీఐ)ను అది నిర్దేశించిన ప్రమాణాలనుంచి తప్పుకోవాలని న్యాయవ్యవస్థ ఆదేశించజాలదంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ రమేష్ దవే, ఆదర్శ్ కుమార్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ‘‘ఓ సంస్థలో విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చే స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకుంటే.. ఒకవేళ ఆ విద్యార్థులు తుదిపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ వారు నిజజీవితంలో మంచి వృత్తి నిపుణులుగా తయారుకాలేరు. ఈ కేసులోనూ ఎంసీఐ నిర్దేశించిన ప్రమాణాల మేరకు మిమ్స్‌లో సౌకర్యాలు లేవు. అందువల్ల 50 అదనపు సీట్ల మంజూరు సాధ్యం కాదు. అయినప్పటికీ మరోసారి తనిఖీలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎంతమాత్రం సరికాదు. వాటిని రద్దు చేస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
వివాదం పూర్వాపరాలివీ...
2012-13 విద్యాసంవత్సరానికి మిమ్స్‌కు ఎంసీఐ 100 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. తరువాతి విద్యాసంవత్సరానికి మరో 50 అదనపు సీట్లను పొందగలిగింది. ఈ 50 అదనపు సీట్ల ఉత్తర్వుల్ని 2014-15 సంవత్సరానికి పొడిగించాలన్న మిమ్స్ అభ్యర్థనను ఎంసీఐ తోసిపుచ్చింది. 2015-16 సంవత్సరానికి కూడా మిమ్స్ అటువంటి దరఖాస్తు పెట్టుకోగా, తనిఖీలు నిర్వహించిన ఎంసీఐ.. నిర్దేశించిన ప్రమాణాల మేరకు సౌకర్యాలు లేవని తేలుస్తూ అదనపు సీట్ల మంజూరు సాధ్యం కాదని తేల్చింది. దీనిపై మిమ్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, న్యాయమూర్తి జయంత్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం.. మిమ్స్‌లో మరోసారి తనిఖీలు నిర్వహించాలంటూ ఎంసీఐని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్ని సవాలుచేస్తూ ఎంసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ ఏ.ఆర్.దవే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.