న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది.
ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్‌కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది.
ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది.
ఇక ప్రత్యక్ష ప్రసారాలు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment