మెడికల్‌ పీజీ సీట్ల బ్లాకింగ్‌ స్కాంలో ఈడీ దూకుడు | ED aggression in blocking scam of medical PG seats in Mallareddy Collage | Sakshi
Sakshi News home page

మెడికల్‌ పీజీ సీట్ల బ్లాకింగ్‌ స్కాంలో ఈడీ దూకుడు

Published Sat, Nov 9 2024 5:15 AM | Last Updated on Sat, Nov 9 2024 5:15 AM

ED aggression in blocking scam of medical PG seats in Mallareddy Collage

మల్లారెడ్డి కాలేజీ ఏవో సురేందర్‌రెడ్డి వాంగ్మూలం నమోదు 

తాజాగా ఈడీ ముందుకు ‘చల్మెడ ఇన్‌స్టిట్యూట్‌’ ప్రతినిధి 

ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కాలేజీలతో పాటు మరికొన్ని కళాశాలలకూ సమన్లు!

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు. గురువారం మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సురేందర్‌ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ నాయకుడు, చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనరసింహారావు విచారణకు హాజరైన­ట్టు అధికారవర్గాల సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి 2023లో ఎమ్మెల్యేగా పో­టీ చేసిన లక్ష్మీనర్సింహారావును మెడికల్‌ సీట్ల బ్లాక్‌ దందాపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. 

ఏమిటీ కుంభకోణం? 
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌కి అనుబంధంగా ఉన్న 12 మెడికల్‌ కాలేజీల్లో పలు సీట్లను బ్లాక్‌ చేసి, అధిక ఫీజులకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది (2023) జూన్‌లో సోదాలు జరిపారు. నీట్‌ పీజీ మెరిట్‌ ఆధారంగా కనీ్వనర్‌ కోటా లేదా ఫ్రీ సీట్ల కింద దాదాపు 45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యార్థులు ఎవరూ వర్సిటీలో అడ్మిషన్‌ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ 2022 ఏప్రిల్‌లో వరంగల్‌లోని మటా్వడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

సీట్లను బ్లాక్‌ చేసి పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 2023 జూన్‌ 22న బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, కరీంనగర్‌ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, ఖమ్మంలోని మమత మెడికల్‌ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్‌ మెడికల్‌ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కాలేజీ, సూరారంలోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, పటాన్‌చెరులోని మహేశ్వర మెడికల్‌ కాలేజీ, చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ, డెక్కన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిపింది. 

అందులో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు.. 12 కాలేజీలతో పాటు మరికొన్ని కాలేజీల యాజమాన్యాలకు కూడా సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. అన్ని కాలేజీల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం కాలేజీల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement