
సాక్షి, సిటీబ్యూరో: మెడిసిన్‌లో సీటు పేరుతో నగరానికి చెందిన ఓ విద్యార్థినికి టోకరా వేయడానికి సైబర్ నేరగాడు ఏకంగా సోనియా గాంధీ పేరునే వాడేశాడు. తన మామ ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) పని చేస్తున్నాడంటూ చెప్పి రూ.1.08 లక్షలు వసూలు చేశాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న యువతికి ఫేస్‌బుక్ ద్వారా నిఖిల్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌గా మారిన ఇరువురూ కొన్నాళ్ల పాటు మెసెంజర్‌లో చాటింగ్స్ కూడా చేసుకున్నారు. ఓ సందర్భంలో సదరు యువతి తాను డాక్టర్ కావాలని కలగన్నానని, అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా మెడిసిన్ సీటు రాలేదని బాధపడింది. దీంతో ఆమెను ఓదారుస్తున్నట్లు నటించిన నిఖిల్ ఎంబీబీఎస్ చేయాలని ఇప్పటికీ ఉందా? అంటూ అడిగాడు.
ఆమె ఔనని చెప్పడంతో ఎక్కడో ఎందుకు సిటీలో ఉన్న గాంధీ మెడికల్ కాలేజీలోనే సీటు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అదెలా సాధ్యమంటూ ఆమె ప్రశ్నించగా.... తన మామ సోనియా గాంధీకి పీఏ అని, ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనంటూ చెప్పాడు. ఆమె తన మాటల్ని పూర్తిగా నమ్మిందని నిర్థారించుకున్న తర్వాత అసలు కథ ప్రారంభించాడు. తన మామకు ఫార్మాలిటీస్‌గా రూ.2 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. మెడిసిన్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న సదరు విద్యార్థిని రూ. 1.08 లక్షలు అతడు సూచించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. డబ్బులు డిపాజిట్ చేసిన తరువాత సదరు వ్యక్తి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. ఎంతగా ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్, బాధితురాలు డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల నంబర్ల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment