సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం ‘నీట్’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) నిర్వహించనున్నారు. దీని కోసం రాష్ట్రంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి సుమారు 5 వేల సీట్లున్నాయి. 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసుకోనుండగా, 15 శాతం సీట్లు మాత్రం నేషనల్ పూల్(కేంద్ర కోటా)లో భర్తీ అవుతాయి. ఈ 15 శాతం సీట్లు ఏపీ ఇవ్వడం వల్ల.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలిచ్చే 15 శాతం కోటాకు రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశముంటుంది. ప్రభుత్వ పరిధిలో 11 వైద్యకాలేజీలుండగా, ప్రైవేటు పరిధిలో 18 వరకు ఉన్నాయి.
గంట ముందే రావాలి..
పరీక్షా కేంద్రానికి గంట ముందే వచ్చేలా విద్యార్థులు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30కల్లా పరీక్షా కేంద్రానికి వచ్చి ఇన్విజిలేటర్‌కు అడ్మిట్ కార్డు చూపించాలి. 1.45 గంటలకు బుక్‌లెట్ ఇస్తారు. 1.50కి బుక్‌లెట్‌లో వివరాలు నింపాల్సి ఉంటుంది. సరిగ్గా 2 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకే పరీక్షా కేంద్రానికి రావడం వల్ల ప్రశాంతంగా ఇవన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యంగా వస్తే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతించరు.
తప్పకుండా తీసుకురావాల్సినవి ఇవే..
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు విధిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు.. అంటే పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తెచ్చుకోవాలి. కోవిడ్ నిబంధనల మేరకు మాస్కు, గ్లౌజులు ధరించాలి. శానిటైజర్(50 ఎం.ఎల్) బాటిల్ తెచ్చుకోవచ్చు.
నిషేధిత జాబితా..
ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్‌లు, ఆభరణాలు తదితరాలు తీసుకురాకూడదని నిబంధనల్లో స్పష్టం చేశారు. చెవులకు ధరించే ఆభరణాలు, బ్రాస్‌లెట్, వేలి ఉంగరాలు, ముక్కు పిన్‌లు, చైన్‌లు, నక్లెస్‌లు, పెండెంట్స్ తదితర ఆభరణలేవీ పెట్టుకోకూడదు. అలాగే కాగితాలు, బిట్స్ పేపర్లు, జామెట్రీ బాక్స్‌లు, పెన్సిల్ బాక్స్‌లు, క్యాలిక్యులేటర్లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరైజర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్స్ తీసుకురాకూడదు. మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, పేజర్స్, హెల్త్ బ్యాండ్‌లు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, స్కార్ఫ్, కెమెరా తదితర వస్తువులన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి.
NEET 2021: నేడు ‘నీట్’.. ఇవి వద్దు, ఇవి తప్పనిసరి
Published Sun, Sep 12 2021 2:43 AM | Last Updated on Mon, Sep 20 2021 1:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment