సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఎట్టకేలకు ఫలించింది. కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద వైద్య సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో మార్గం సుగమమైంది. ఈ మేరకు కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈడబ్ల్యూఎస్ కింద రాష్ట్రానికి పెరిగిన 360 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 29న (సోమవారం) నోటిఫికేషన్ జారీ చేయనుంది. వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు. సాధారణంగా రిజర్వేషన్ పరిధిలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాలకు ఈ సీట్లు వర్తించవు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికోసమే ఈ సీట్లు కేటాయిస్తారు. కేంద్రం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కచ్చితంగా పొంది ఉంటేనే సీటుకు అర్హులవుతారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరం..
ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక్కసారిగా రాష్ట్రంలో 360 సీట్లు పెరగడం సాధారణ విషయం కాదని, ఇది నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా, అందులో 10 కాలేజీలకు సీట్లు పెరిగాయి. ఆంధ్రా మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాల, రంగరాయ మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కాలేజీల్లో అత్యధికంగా 50 చొప్పున సీట్లు పెరిగాయి. ఈ సీట్లకు ఇప్పటికే భారతీయ వైద్య మండలి అనుమతి కూడా లభించింది. ఇదివరకే 14 వేల మంది మొత్తం అభ్యర్థులు ఈ ఏడాది సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థులు సాధారణ మెడికల్ కాలేజీలలో ఓపెన్ కేటగిరీ కింద సీటు తీసుకుని ఉన్నా సరే మంచి కాలేజీకి మారవచ్చు. ఇందుకోసం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మళ్లీ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంబీబీఎస్ సీటు తృటిలో అవకాశం కోల్పోయిన చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు సీటు దక్కే అవకాశం ఉంటుంది.
వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి
ప్రభుత్వం నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల భర్తీకి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ కోటాలో ఉన్న సీట్లను వారితోనే భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాం.
– డా. సీవీ రావు, వైస్ చాన్సలర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment