ఫస్ట్‌ ప్రైవేటుకా?  | Counseling for Private Ownership Seats | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ ప్రైవేటుకా? 

Published Wed, Jul 24 2019 2:08 AM | Last Updated on Wed, Jul 24 2019 2:08 AM

Counseling for Private Ownership Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ పూర్తికాకముందే ప్రైవేటు కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల భర్తీ అయిపోయాకగానీ ప్రైవేటు సీట్ల వైపు విద్యార్థులు వెళ్లరు. ఇంకా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మూడో విడత, ఆ తర్వాత నాలుగో విడత కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. పైగా జాతీయస్థాయిలో నీట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత, నేషనల్‌ పూల్‌కు రాష్ట్రం నుంచి ఇచ్చిన 15 శాతం సీట్లల్లో భర్తీ కాకుండా మిగిలే సీట్లను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. వాటిని కూడా మూడో విడత కన్వీనర్‌ కోటా సీట్లతోపాటు భర్తీ చేస్తారు. అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మరో 190 సీట్లు, ఎన్‌సీసీ సీట్లు ఉన్నాయి. వాటన్నింటికీ మూడో విడత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఇవన్నీ ఉండగా.. వాటి కౌన్సెలింగ్‌ పూర్తికాకముందే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ మేనేజ్‌మెంట్‌ సీట్లను నింపడం కోసం ముందస్తుగానే కౌన్సెలింగ్‌ నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు కన్వీనర్‌ కోటాలో రెండో విడత కౌన్సెలింగ్‌ మాత్రమే పూర్తయింది. రెండో విడతలో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 24 లోగా కాలేజీల్లో చేరాల్సి ఉంది. మూడో విడత ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానుంది. అయితే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు ఈ నెల 25 నుంచి 28 వరకు కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

నష్టపోతామని ఆందోళన.. 
మూడో విడతలో సీటు వస్తుందన్న ఆశ ఉన్నప్పటికీ, ఏదో భయంతో బీ, సీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరుకాక తప్పని పరిస్థితి. ఒకవేళ అందులో సీటు వస్తే చేరాలా? వద్దా? ఒకవేళ చేరితే కన్వీనర్‌ కోటాలో మూడో విడత కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీటు వస్తే ఏమవుతుందనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఏ కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో రూ.10 వేలు, ప్రైవేట్‌ కాలేజీల్లో రూ.60 వేలుగా ఫీజు ఉంది. అదే బీ కేటగిరీ అయితే ఏడాదికి రూ.12 లక్షలు, సీ కేటగిరీకి రూ.24 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంది. బీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే రూ.40 వేలు డీడీనీ యూనివర్సిటీ ఫీజు కింద చెల్లించాలి. సీటు వచ్చిందంటే రూ.12 లక్షలు కాలేజీ ఫీజు, రెండో ఏడాదికి మరో రూ.12 లక్షల గ్యారంటీతో ఆగస్టు రెండో తేదీలోపు ఆయా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో చేరాలి. అప్పటివరకు ఏ కేటగిరీ మూడో విడత కౌన్సెలింగ్‌ జరగదు. ఒకవేళ బీ కేటగిరీలో చేరిన తర్వాత ఏ కేటగిరీలో సీటు వస్తే రూ.40 వేలు, కాలేజీకి సంబంధించిన ఇతరత్రా ఫీజులు దాదాపు రూ.50 వేలు వదులుకోవాల్సిందే. అలా అని వదిలేస్తే సీటు పోతుందేమోనని భయం. ఎటూ తేల్చుకోలేక తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒకవేళ వదులుకోవాలని ప్రయత్నిస్తే కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఇబ్బంది పెట్టే అవకాశముంది. పైపెచ్చు బీ, సీ కేటగిరీ సీట్లకు డబ్బులు సమకూర్చుకోవడం, చెల్లించడం, బ్యాంకు గ్యారంటీ చూపడం తప్పదు. ఇదంతా కూడా మధ్యతరగతి ప్రజలకు అత్యంత భారం కానుంది. దీనిపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. 

బీ, సీ కేటగిరీ సీట్లు నింపకపోతే సమస్య.. 
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మెడికల్‌ కాలేజీ తరగతులు ప్రారంభించాలి. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ. అప్పటివరకు బీ, సీ కేటగిరీ సీట్లను భర్తీ చేయకపోతే ఏకంగా ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లు నిండే అవకాశం ఉండదు. అంత తక్కువతో కాలేజీలను ఎలా ప్రారంభించగలం? కన్వీనర్‌ కోటాలో సీటు వస్తుందా? రాదా? అన్నది విద్యార్థులు వారివారి ర్యాంకులను బట్టి అంచనాకు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం కన్వీనర్‌ కోటాలో వచ్చేట్లయితే బీ, సీ కేటగిరీలో చేరకుండా ఉండాలి. అంచనా వేయలేని పరిస్థితుల్లో బీ కేటగిరీలో చేరి.. మూడో దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటా సీటు వస్తే చెల్లించిన డొనేషన్‌ను ప్రైవేటు కాలేజీలు తిరిగి వెనక్కి ఇస్తాయి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
–డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement