సాక్షి, అనంతపురం: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేరడానికి ఒకప్పుడు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇతర ప్రాంతాల్లో అవకాశం లేకపోతేనే ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అనంతపురం మెడికల్ కాలేజీ మిగతా కళాశాలలకు దీటుగా పోటీ పడుతోంది.
వసతులు భేష్
అనంత మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) కింద సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఏర్పాటైంది. మెరుగైన వైద్యవిద్య అభ్యసించేందుకు ఇది దోహదపడుతోంది. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక భారీగా అధ్యాపకుల నియామకం చేపట్టింది. ఇటీవల జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో 60 మందికి పైగా అనంతలోనే నియమితులయ్యారు. తాజాగా అదనపు పోస్టులు కూడా మంజూరు చేసింది. నర్సింగ్ సేవలకూ పెద్దపీట వేస్తూ వంద మంది కొత్త నర్సులను నియమిస్తోంది. ఈ పరిణామాలతో అనంత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటివరకూ ఆంధ్రా మెడికల్ కాలేజీ (విశాఖపట్నం), గుంటూరు మెడికల్ కాలేజీ (గుంటూరు) మొదటి వరుసలో కొనసాగుతున్నాయి. రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), కర్నూలు మెడికల్ కాలేజీ (కర్నూలు) వంటి వాటిలో రెండో అవకాశం కింద చేరుతున్నారు. ఈ తరహాలోనే అనంతపురం మెడికల్ కాలేజీలోనూ చేరడానికి ఎంతోమంది సుముఖత చూపుతున్నారు. గత ఏడాది జాతీయ ర్యాంకులను పరిశీలిస్తే రాష్ట్రంలోని మూడు రిమ్స్‌లతో పోలిస్తే అనంత మెడికల్ కాలేజీలోనే మెరుగైన ర్యాంకర్లు చేరారు.
మెరుగైన ర్యాంకర్లు ఇక్కడికే..
రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది ర్యాంకులు (నీట్) పరిశీలిస్తే.. అనంతపురం చాలా కాలేజీల కంటే మెరుగ్గా ఉన్నట్టు తేలింది. రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఒంగోలు, రిమ్స్ కడప, రిమ్స్ శ్రీకాకుళం, ఏసీఎస్‌ఆర్ నెల్లూరుతో పోలిస్తే అనంతపురం వైద్య కళాశాలలోనే వివిధ కేటగిరీలకు చెందిన మెరుగైన ర్యాంకర్లు చేరారు. ఉదాహరణకు నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో బీసీ–ఈ అభ్యర్థి 68,665 ర్యాంకుతో చివరి సీటు పొందారు. అదే అనంతపురంలో 60,586 ర్యాంకుకే బీసీ–ఈ సీట్లు పూర్తయ్యాయి. అదే శ్రీకాకుళం రిమ్స్‌లో అయితే ఏకంగా 1,15,113 ర్యాంకు వచ్చిన బీసీ–ఈ అభ్యర్థికి చివరి సీటు లభించింది. దీన్నిబట్టి అనంతలో వైద్యవిద్య అభ్యసించడానికి మెరుగైన ర్యాంకర్లు ఆసక్తి చూపుతున్నారన్నది స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment