రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచన
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలోని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో చేపట్టే వైద్య పోస్టుల నియామకాలన్నింటినీ ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని భావిస్తోంది. ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ర్టంలో 600 మంది వైద్యులు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం) కింద 275 మంది వైద్యులను నియమించనున్నారు.
అయితే ఆర్‌బీఎస్‌కే కింద చేపట్టే నియామకాల్లో 120 మంది ఆయుష్ వైద్యులను, 480 మంది ఎంబీబీఎస్ వైద్యులను నియమించాలని ప్రభుత్వం తొలుత మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్‌బీఎస్‌కే కింద నియమితులయ్యే వైద్యులు గ్రామాల్లో పర్యటించి పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదలలో సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర అధికారి ఒకరు ఇటీవల రాష్ట్రానికి వచ్చి ఆర్‌బీఎస్‌కేలో వైద్య పోస్టుల నియామకాలను పూర్తిగా ఆయుష్ వైద్యులతోనే చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. కేవలం పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించడమే కాబట్టి ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిసింది.
కొన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులను ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేస్తున్నారని ఆ అధికారి చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎంబీబీఎస్‌ల బదులు ఆయుష్ వైద్యులతోనే నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకాలకు సంబంధించి కేంద్రం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులకు 80 శాతం, ఆయుష్ వైద్యులకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. ఆ మార్గదర్శకాలను ఇప్పుడు మార్చాలని యోచిస్తుండటంతో నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ చర్యను ఎంబీబీఎస్ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆర్‌బీఎస్‌కే నియామకాలు ఆయుష్ వైద్యులతోనే!
Published Mon, Mar 2 2015 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement