సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేలా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధమవుతోంది. ముఖ్యంగా రోగులకు ఆక్సిజన్‌ను అందించడంలో ఎటువంటి కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మొదటి, రెండో వేవ్‌ల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 17 వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించగా.. తాజాగా మరో 10 వేల పడకలకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనుంది.
ప్రతి ఏరియా ఆస్పత్రిలోనూ 20 పడకలను ఐసీయూలుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 20 శాతం పడకలను పిల్లలకు కేటాయించనున్నారు. ఐసీయూ పడకలనూ ఇదే విధంగా కేటాయిస్తారు. వంద పడకలకు పైగా ఉన్న ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్‌న్‌ప్లాంటు ఉండాలని ఆదేశించారు. 100 పడకలు నుంచి 200 పడకల వరకు ఉన్న ఆసుపత్రులు నిమిషానికి 500 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంటును ఏర్పాటు చేయాలి. 200–500 మధ్య పడకలున్న ఆసుపత్రులు నిమిషానికి వెయ్యి లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పాలి. 500 పడకలకు మించి ఉన్న ఆస్పత్రి నిమిషానికి 2 వేల లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును కలిగి ఉండాలి.
థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో..
కరోనా థర్డ్‌వేవ్‌పై జాతీయ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘కార్యాలయాలు తెరుచుకున్నాయి. మార్కెట్లు రద్దీగా మారాయి. జనసంచారం పెరిగింది. కానీ జాగ్రత్తలు పాటించడంలో విఫలమవుతున్నాం. భౌతికదూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది..’అని పేర్కొంది. ఈ వైఖరి థర్డ్‌వేవ్‌ను మోసుకొస్తుందని హెచ్చరించింది. తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం, టీకాలు వేయడంలో వెనుకబడి ఉండటం వల్ల థర్డ్‌వేవ్ వస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలిపింది. దేశంలోని 40 మంది నిపుణులు కూడా థర్డ్‌వేవ్ అక్టోబర్‌లో వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు, ఇతరత్రా సన్నద్ధతపై దృష్టి సారించింది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సన్నాహాలు ఇలా..
►పిల్లల చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలను అందుబాటులోకి తీసుకురావాలి.
►దాదాపు కోటిన్నర ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ కిట్లను కొనుగోలు చేయాలి.
►దాదాపు 2 వేల మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి.
►ఫైనలియర్ చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థుల సేవలనూ ఉపయోగించుకోవాలి. ఆ మేరకు వారికి శిక్షణ ఇవ్వాలి.
►ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవసరమైన మేర ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకురావాలి.
Comments
Please login to add a commentAdd a comment