AYUSH doctors
-
వైద్యుల్లో పీఆర్సీ జోష్
సాక్షి, అమరావతి: ఇటీవలి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బోధనాస్పత్రుల్లో వైద్యులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ ఆస్పత్రుల్లోని వైద్యుల్లో ఆనందం వెల్లువెత్తింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా ఆస్పత్రుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి వైద్యులు క్షీరాభిõÙకం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఫొటో ముందు కేక్‌లు కట్‌చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 110 శాతం, అసోసియేట్లకు 60 శాతం, ప్రొఫెసర్లకు 50 శాతం వరకూ వేతనం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి సుమారు రూ. 312 కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా.. తమ సమస్యలు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఆర్సీ ఇచ్చారని, మాట ఇస్తే వెనక్కి తగ్గరనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారని ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డా.జయదీర్ అన్నారు. 2016లోనే పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తాజా పీఆర్సీ వల్ల 3 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కడప రిమ్స్‌లో సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న వైద్యులు కోవిడ్ సేవలు.. ఆయుష్ వైద్యులకు లబ్ధి కోవిడ్ సేవల్లో భాగంగా ఆయుష్ వైద్యులను నియమించడం 300 మంది వైద్యులకు లబ్ధి జరిగిందని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని ఆయుష్ వైద్యుల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయుష్ వైద్యులకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని సీఎంకు విన్నవించింది. -
ఆయుర్వేదానికి పూర్వ వైభవం: ఈటల
సోమాజిగూడ: ఆయుర్వేద వైద్యానికి రానున్న కాలంలో ఆదరణ పెరగనుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రభుత్వాలపరంగా ఆయుష్కు అంత పోత్సాహం లేనప్పటికీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే పాత పద్ధతులను మళ్లీ ప్రజలు ఆచరిస్తున్నా రని అనిపిస్తోందన్నారు. ఆరోగ్య సూ త్రాలలో భాగంగా ఒకప్పుడు గరీబోళ్లు తినే తిండి రాగులు, సజ్జలు ప్రస్తుతం సంపన్నుల తిండిగా మారిందన్నారు. ఆదివారం అమీర్‌పేట్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణశాఖ ఆధ్వర్యంలో ‘ప్రాణాభిసార–2019’పేరుతో జరి గిన జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పాత తరంలో తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత వచ్చిన విధంగానే ఆయుర్వేద వైద్యం పూర్వ వైభవం పొందనుందని తెలిపారు. ప్రస్తుతం పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ వైద్యానికి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సమ్మిరెడ్డి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డైరెక్టర్ విక్రమ్ సింగ్, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ అలగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు. ‘డాక్టర్లకు జియో ట్యాగ్ అమలుచేయబోం’ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న ఆయుష్ డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ నమోదుకు జియో ట్యాగింగ్ అమలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ తమకు హామీ ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్య విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము మంత్రిని కలిసి విన్నవించినట్లు చెప్పారు. వెంటనే ఆయుష్ ఉన్నతాధికారులకు సోమవారం ఆదేశాలు ఇస్తానని మంత్రి పేర్కొన్నారని లాలూ ప్రసాద్ వెల్లడించారు. ఆయుష్‌లో పనిచేస్తున్న స్వీపర్ల నుంచి డాక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో అటెండెన్స్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. జియో ట్యాగింగ్‌లా పనిచేసే ఈ యాప్ ద్వారానే ప్రతి రోజూ అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ సమయంలో లొకేషన్ యాక్సెస్ ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. -
రేపు ‘ఆయుష్’ వైద్యుల సమావేశం
అనంతపురం మెడికల్: నేషనల్ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ (నామా) జిల్లా కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ‘ఆయుష్’ వైద్యుల సమావేశం నిర్వహించనున్నట్లు నామా రాష్ట్ర నేతలు డాక్టర్ తిరుపతినాయుడు, కుమారయ్య, గోకుల్ నాగేశ్వరరావు తెలిపారు. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పీవీకేకే పీజీ కళాశాలలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ వైద్యుల సమస్యలు, పారామెడికల్ సమస్యలు, ఎన్ఆర్హెచ్ఎం, ఆర్బీఎస్కే తదితర వాటిపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులంతా హాజరుకావాలని కోరారు. -
ఎంబీబీఎస్ పోస్టుల్లో ఆయుష్ వైద్యులు
- 160 మంది ఆయుష్‌లను నియమించాలని నిర్ణయం - మెదక్ మినహా అన్ని జిల్లాల్లో 5న కౌన్సెలింగ్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసే ప్రక్రియకు ఆటంకాలు తొలగిపోయాయి. రెండుసార్లు నోటిఫికేషన్లు, కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఎంబీబీఎస్ డాక్టర్లు అనేక చోట్ల మెడికల్ ఆఫీసర్లుగా చేరకపోవడంతో ప్రభుత్వం వాటిని ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే భర్తీ చేయగా మిగిలిన 160 ఎంబీబీఎస్ పోస్టులను ఆయుష్ వైద్యులతో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఐదో తేదీన వాటికి కౌన్సెలింగ్ నిర్వహించి ఒకేరోజు (మెదక్ మినహా) అన్ని జిల్లాల్లో భర్తీ చేయాలని జిల్లా డీఎంహెచ్వోలను ఆదేశించింది. కిందటేడాది ఆగస్టు 21న, ఈ ఏడాది జూలై 22వ తేదీన ఆర్బీఎస్కే పోస్టులకు ప్రభుత్వం రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఎంబీబీఎస్‌ల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో చివరకు ఈ నిర్ణయం తీసుకుంది. పురుష డాక్టర్లు 72... మహిళా డాక్టర్లు 88 0-16 ఏళ్ల చిన్న పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్‌బీఎస్‌కేను ప్రారంభించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్ఎన్సీ)ను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఒక్కో క్లస్టర్ కింద రెండు మొబైల్ హెల్త్ టీమ్‌లు ఉంటాయి. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్ హెల్త్ టీంలు సేవలు అందిస్తాయి. అందుకోసం 630 మంది ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలి. అయితే మెదక్ జిల్లాలో మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు పూర్తిస్థాయిలో చేరారు. మిగిలిన జిల్లాల్లో 280 ఎంబీబీఎస్ డాక్టర్లకు గాను.. ఇప్పటివరకు కేవలం 120 మంది మాత్రమే చేరారు. మిగిలిన 160 చోట్ల ఎంబీబీఎస్ డాక్టర్లు చేరలేదు. దీంతో వాటన్నింటినీ ఆయుష్ వైద్యులతో నింపుతారు. అందులో పురుష డాక్టర్లు 72, మహిళా డాక్టర్లు 88 మందికి అవకాశం కల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 17 మంది పురుష, 16 మంది మహిళా ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను నియమిస్తారు. నిజామాబాద్ జిల్లాలో 12 పురుష, 14 మంది మహిళా ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను నియమిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది పురుష, 12 మంది మహిళ, హైదరాబాద్‌లో 8 మంది పురుష, 10 మంది మహిళ , కరీంనగర్ జిల్లాలో 7 పురుష, 10 మంది మహిళ, వరంగల్ జిల్లా లో 5 పురుష, 10 మంది మహిళ, ఖమ్మం జిల్లాలో 4 పురుష, 9 మంది మహిళ, నల్లగొండ జిల్లాలో నలుగురు చొప్పున పురుష, మహిళ, రంగారెడ్డి జిల్లాలో 4 పురుష, 3 మహిళా మెడికల్ ఆఫీసర్లను ఆయుష్ వైద్యులతో నియమిస్తారు. -
ఆర్బీఎస్కే నియామకాలు ఆయుష్ వైద్యులతోనే!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచన సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో చేపట్టే వైద్య పోస్టుల నియామకాలన్నింటినీ ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని భావిస్తోంది. ఎన్హెచ్ఎం కింద రాష్ర్టంలో 600 మంది వైద్యులు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం) కింద 275 మంది వైద్యులను నియమించనున్నారు. అయితే ఆర్బీఎస్కే కింద చేపట్టే నియామకాల్లో 120 మంది ఆయుష్ వైద్యులను, 480 మంది ఎంబీబీఎస్ వైద్యులను నియమించాలని ప్రభుత్వం తొలుత మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్బీఎస్కే కింద నియమితులయ్యే వైద్యులు గ్రామాల్లో పర్యటించి పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదలలో సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర అధికారి ఒకరు ఇటీవల రాష్ట్రానికి వచ్చి ఆర్బీఎస్కేలో వైద్య పోస్టుల నియామకాలను పూర్తిగా ఆయుష్ వైద్యులతోనే చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. కేవలం పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించడమే కాబట్టి ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులను ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేస్తున్నారని ఆ అధికారి చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎంబీబీఎస్‌ల బదులు ఆయుష్ వైద్యులతోనే నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకాలకు సంబంధించి కేంద్రం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులకు 80 శాతం, ఆయుష్ వైద్యులకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. ఆ మార్గదర్శకాలను ఇప్పుడు మార్చాలని యోచిస్తుండటంతో నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ చర్యను ఎంబీబీఎస్ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.