National arogya mission
-
1,330 వైద్య ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 1,330 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో 630 ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులున్నాయి. 300 ఏఎన్ఎం, 300 ఫార్మసిస్టులు సహా మరో 100 పోస్టుల్లో ఫిజియోథెరఫిస్టులు, స్టాఫ్ నర్సులు, సైకాలజిస్టులు తదితర ఉద్యోగాలున్నాయి. ఈ పోస్టులన్నింటినీ జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. వచ్చే వారంలో జిల్లాల్లో నోటిఫికేషన్ జారీచేసి నెల రోజుల్లోపు భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తారు. మొబైల్ హెల్త్ టీముల కోసం... 0 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్ఎన్సీ)ను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో క్లస్టర్ కింద రెండు మొబైల్ హెల్త్ టీమ్ లు ఉంటాయి. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్ హెల్త్ టీంలు సేవలు అందిస్తాయి. ఒక్కో టీమ్‌లో ఒక మహిళా డాక్టర్, ఒక పురుష డాక్టర్, ఒక ఏఎన్ఎం, ఒక ఫార్మసిస్టు ఉంటారు. మొత్తంగా ఈ మొబైల్ టీమ్‌ల కోసమే 1,200 మందిని నియమిస్తారు. పిల్లలకు వైద్యం చేయడానికి జిల్లాకొక డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను ఏర్పాటు చేస్తారు. ఆయా కేంద్రాల్లో ఒక పిల్లల వైద్య నిపుణుడు, ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్, ఒక డెంటల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఆ ప్రకారం 10 జిల్లాల్లో 30 మంది వైద్యులను డీఈఐసీ కేంద్రాల్లో నియమిస్తారు. వీటితోపాటు డీఈఐసీల్లో ఒక స్టాఫ్ నర్సు, ఒక ఫిజియోథెరఫిస్టు, ఆడియాలజిస్టు అండ్ స్పీచ్ థెరపిస్టు, సైకాలజిస్టు, ఆప్తమెట్రిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పెషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డీఈఐసీ మేనేజర్ పోస్టులున్నాయి. అన్ని జిల్లాల్లోని కేంద్రాల్లో కలిపి 130 మందిని నియమిస్తారు. -
ఆర్బీఎస్కే నియామకాలు ఆయుష్ వైద్యులతోనే!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచన సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో చేపట్టే వైద్య పోస్టుల నియామకాలన్నింటినీ ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని భావిస్తోంది. ఎన్హెచ్ఎం కింద రాష్ర్టంలో 600 మంది వైద్యులు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం) కింద 275 మంది వైద్యులను నియమించనున్నారు. అయితే ఆర్బీఎస్కే కింద చేపట్టే నియామకాల్లో 120 మంది ఆయుష్ వైద్యులను, 480 మంది ఎంబీబీఎస్ వైద్యులను నియమించాలని ప్రభుత్వం తొలుత మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్బీఎస్కే కింద నియమితులయ్యే వైద్యులు గ్రామాల్లో పర్యటించి పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదలలో సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర అధికారి ఒకరు ఇటీవల రాష్ట్రానికి వచ్చి ఆర్బీఎస్కేలో వైద్య పోస్టుల నియామకాలను పూర్తిగా ఆయుష్ వైద్యులతోనే చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. కేవలం పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించడమే కాబట్టి ఇందుకు ఎంబీబీఎస్ వైద్యుల అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులను ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేస్తున్నారని ఆ అధికారి చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎంబీబీఎస్‌ల బదులు ఆయుష్ వైద్యులతోనే నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకాలకు సంబంధించి కేంద్రం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులకు 80 శాతం, ఆయుష్ వైద్యులకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. ఆ మార్గదర్శకాలను ఇప్పుడు మార్చాలని యోచిస్తుండటంతో నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ చర్యను ఎంబీబీఎస్ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
ఆరోగ్య మిషన్‌కు సుస్తీ
ఒంగోలు సెంట్రల్: గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా విడుదలైన నిధులు నిరుపయోగంగా మారాయి. నిధుల వినియోగంలో అలవిమాలిన అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పీహెచ్‌సీలకు విడుదలైన నిధుల ఖర్చుపై పర్యవేక్షణ లోపించడం..గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో వీధులన్నీ మురుగు, చెత్తతో దర్శనమిస్తున్నాయి. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లదే ఇష్టారాజ్యంగా ఉండటంతో నిధుల వినియోగంలో పారదర్శకత ఉండటం లేదు. కొందరు ఆరోగ్యశాఖ సిబ్బంది, కార్యదర్శులు కలిసి నిధులు స్వాహా చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. జిల్లాలో 1029 పంచాయతీల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఒక్కో పంచాయతీకి రూ.10 వేల చొప్పున నిధులు విడుదలవుతాయి. ఈ నిధులు పంచాయతీల్లో పనిచేసే సబ్‌సెంటర్ ఏఎన్ఎం, కార్యదర్శి జాయింట్ అకౌంట్లో పీహెచ్సీ ద్వారా జమ చేయాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, శుద్ధి చేసిన తాగునీటిని క్లోరినేషన్ చేయించడం వంటి పనులను ఆ నిధుల ద్వారా చేయాలి. జిల్లావ్యాప్తంగా 80 పీహెచ్సీలుండగా ఆరోగ్యమిషన్ ద్వారా విడుదలైన నిధులు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లోకి వెళ్తాయి. ఒక్కో పంచాయతీకి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1,02,90,000 నిధులు గత ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యాయి. వీటిలో దాదాపు 300కు పైగా పంచాయతీలు నిధులు ఖర్చు చేయలేదు. మరికొన్ని పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో నిధులు డ్రా చేసే పరిస్థితి లేకపోయింది. ప్రస్తుతం ఎన్ఆర్హెచ్ఎం ఆడిట్ పనులు జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఆడిట్ పూర్తయితే ఏ పంచాయతీలు నిధులు ఖర్చు చేశాయి..ఏవి చేయలేదనేది పూర్తిగా తేలుతుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యాన్ని మెరుగుపరిచే ప్రణాళికను రూపొందించారు. దీని కోసం జిల్లాలోని పలు మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, గ్రామైక్య సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు ఖర్చు చేసేందుకు ఆయా పీహెచ్‌సీల్లో ప్రజాప్రతినిధులతో ఇంత వరకు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. గత ఏడాది నిధులు ఖర్చు చేయని పంచాయతీలకు ఈ ఏడాది నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా పీహెచ్సీ వైద్యులు పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారి వర్షం నీరు ఇళ్ల మధ్య నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. నిధులు విడుదలైన పంచాయతీల్లోనూ వాటిని ఖర్చుచేసేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిధుల ఖర్చు విషయంలో ఎంపీపీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య కొన్నిచోట్ల విభేదాలు నెలకొన్నాయి. పారిశుధ్యాన్ని మెరుగుపరచాల్సిన ప్రజా ప్రతినిధులు నిధుల వినియోగంలో తమ మాటే నెగ్గాలని పంతాలకు పోవడం విమర్శలకు తావిస్తోంది.