ఒంగోలు సెంట్రల్: గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా విడుదలైన నిధులు నిరుపయోగంగా మారాయి. నిధుల వినియోగంలో అలవిమాలిన అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పీహెచ్‌సీలకు విడుదలైన నిధుల ఖర్చుపై పర్యవేక్షణ లోపించడం..గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో వీధులన్నీ మురుగు, చెత్తతో దర్శనమిస్తున్నాయి. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లదే ఇష్టారాజ్యంగా ఉండటంతో నిధుల వినియోగంలో పారదర్శకత ఉండటం లేదు. కొందరు ఆరోగ్యశాఖ సిబ్బంది, కార్యదర్శులు కలిసి నిధులు స్వాహా చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి.
జిల్లాలో 1029 పంచాయతీల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఒక్కో పంచాయతీకి రూ.10 వేల చొప్పున నిధులు విడుదలవుతాయి. ఈ నిధులు పంచాయతీల్లో పనిచేసే సబ్‌సెంటర్ ఏఎన్‌ఎం, కార్యదర్శి జాయింట్ అకౌంట్‌లో పీహెచ్‌సీ ద్వారా జమ చేయాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, శుద్ధి చేసిన తాగునీటిని క్లోరినేషన్ చేయించడం వంటి పనులను ఆ నిధుల ద్వారా చేయాలి.
జిల్లావ్యాప్తంగా 80 పీహెచ్‌సీలుండగా ఆరోగ్యమిషన్ ద్వారా విడుదలైన నిధులు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లోకి వెళ్తాయి. ఒక్కో పంచాయతీకి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1,02,90,000 నిధులు గత ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యాయి. వీటిలో దాదాపు 300కు పైగా పంచాయతీలు నిధులు ఖర్చు చేయలేదు. మరికొన్ని పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో నిధులు డ్రా చేసే పరిస్థితి లేకపోయింది. ప్రస్తుతం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఆడిట్ పనులు జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఆడిట్ పూర్తయితే ఏ పంచాయతీలు నిధులు ఖర్చు చేశాయి..ఏవి చేయలేదనేది పూర్తిగా తేలుతుంది.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యాన్ని మెరుగుపరిచే ప్రణాళికను రూపొందించారు. దీని కోసం జిల్లాలోని పలు మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, గ్రామైక్య సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు ఖర్చు చేసేందుకు ఆయా పీహెచ్‌సీల్లో ప్రజాప్రతినిధులతో ఇంత వరకు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. గత ఏడాది నిధులు ఖర్చు చేయని పంచాయతీలకు ఈ ఏడాది నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా పీహెచ్‌సీ వైద్యులు పట్టించుకోవడం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారి వర్షం నీరు ఇళ్ల మధ్య నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. నిధులు విడుదలైన పంచాయతీల్లోనూ వాటిని ఖర్చుచేసేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిధుల ఖర్చు విషయంలో ఎంపీపీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య కొన్నిచోట్ల విభేదాలు నెలకొన్నాయి. పారిశుధ్యాన్ని మెరుగుపరచాల్సిన ప్రజా ప్రతినిధులు నిధుల వినియోగంలో తమ మాటే నెగ్గాలని పంతాలకు పోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆరోగ్య మిషన్‌కు సుస్తీ
Published Thu, Sep 11 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement