సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రు ల్లో నెలకొన్న దుస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రోగులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సకు వస్తారు. స్కానింగ్ మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయించుకోవాల్సి వస్తోంది. జనగాం, ఖమ్మం జిల్లా ఆసుపత్రుల తీరు ప్రభుత్వాసుపత్రుల దయనీయతకు అద్దం పడుతోంది. జనగాం ఆసుపత్రిలో 100 పడకలున్నాయి. అందులో కరోనా రోగులకూ చికిత్సచేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిమందే ఇన్‌పేషెంట్లుగా కరోనా రోగులున్నా, చాలామంది హోంఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహా మేర కు చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడకు వచ్చేవారికి ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య తలెత్తితే సీటీస్కాన్ చేయా ల్సి ఉంటుంది. సీటీ స్కానింగ్ యంత్రం చెడిపోవడంతో వారిని ప్రైవేట్‌కు రిఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినవారికి ప్రైవేట్‌లో స్కానింగ్ చేస్తుండటంతో రూ.3 వేల వరకు రోగులు చెల్లిస్తున్నారు. విచిత్రమేంటంటే ఆ ఆసుపత్రిలో పనిచేసే ఒక వైద్యాధికారికి చెందిన సొంత ప్రైవేట్ ఆసుపత్రికే రోగులను రిఫర్ చేస్తున్నారు. ఆ రకం గా ఆ అధికారి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి ప్రైవేట్‌గా డబ్బులు గుంజుతున్నారని ఫిర్యాదులున్నాయి.
ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోనూ అదే తీరు...
ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సీటీస్కాన్ చాలారోజులుగా పనిచేయడంలేదు. అక్కడ ప్రస్తుతం 100 మందికిపైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది ఐసీయూలో ఉన్నారు. అటువంటిచోట కనీసం సీటీ స్కాన్ లేదంటే అక్కడి వైద్యాధికారుల పనితీరు ఏపాటిదో అర్థమవుతోంది. దీనిపై రోగులు, ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా రోగుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకితే కనీసం స్కాన్ చేయలేని దుస్థితి నెలకొంది. బయట రూ.3 వేలకుపైగా డబ్బులు చెల్లించి సీటీస్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి సీరియస్ పేషెంట్లకు తక్షణమే సీటీ స్కాన్ చేయాల్సి వచ్చి నప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. పైగా సొంతంగా డబ్బులు చెల్లించాల్సి రావడంతో రోగులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఇటీవల ఆ జిల్లాకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లినప్పుడు కూడా కొందరు ఆయన దృష్టికి ఈ విషయాలను తీసుకొచ్చారు. కానీ, ఇప్పటికీ కొత్త స్కానింగ్ మిషన్ అందుబాటులోకి రాలేదని బాధితులు అంటున్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు వైద్య పరికరాలు పనిచేయడంలేదు.
ప్రైవేట్ లేబొరేటరీలతో కుమ్మక్కు...
కొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనైతే కనీసం ఎక్స్‌రే మిషన్లు కూడా పనిచేయడంలేదు. అక్కడి టెక్నీషియన్లు లేదా డాక్టర్లు స్థానికంగా ఉండే ప్రైవేట్ లేబొరేటరీలతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల మి షన్లు పనిచేసినా రోగులను ప్రైవేట్ లేబొరేటరీలకు రిఫర్ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ కిట్లు కూడా మాయమవుతున్నా యి. అవి ప్రైవేట్ లేబొరేటరీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొందరు డాక్టర్లు వాటిని తమ సొంత ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. యాంటిజెన్ పరీక్షలు చేసే అధికారం రాష్ట్రంలో ప్రభుత్వంలో తప్ప మరోచోట లేనేలేదు. కానీ, వాటిని కొందరు డాక్టర్లు తమ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారన్న ఫిర్యాదులూ వైద్య, ఆరోగ్యశాఖకు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment