సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకొనే స్థాయిలో నిధులివ్వని కేంద్రం... గత ఆరేళ్లుగా ఇదే వైఖరి అవలంబిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రం రూ. 1.12 లక్షల కోట్లు అడిగితే కేంద్రం మాత్రం రూ. 50.93 వేల కోట్లు (అడిగిన దాంట్లో 45.1 శాతం) మాత్రమే ఇచ్చింది.
తొలి ఏడాది నుంచీ ఇదే తీరు...
గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సాయం చేయడంలో రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది నుంచే కేంద్రానికి మనసు రావడం లేదని కాగ్ లెక్కలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 2014–15 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 21,720 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేసింది. అయితే కారణమేదైనా రాష్ట్ర అంచనాలో 30 శాతానికి అటుఇటూగా రూ. 6,487.72 కోట్లే వచ్చాయి. అప్పటి నుంచి ఏటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద రాష్ట్రానికి అంచనా కంటే తక్కువ నిధులు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్ అంచనా ప్రకారం 2015–16లో 60.89 శాతం, 2016–17లో 62.34 శాతం, 2017–18లో 29.94 శాతం, 2018–19లో 28.16 శాతం నిధులు అందాయి. అంటే రాష్ట్రం ఏర్పాటై ఆరేళ్లవగా అందులో మూడేళ్లు రాష్ట్ర అంచనాల్లో కేవలం 30 శాతం అంతకంటే తక్కువ మాత్రమే కేంద్ర సాయం అందిందన్న మాట.
2019–20లో పరిస్థితి భిన్నం...
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,177.75 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వస్తుందని రాష్ట్రం అంచనా వేయగా అందులో 148 శాతం అంటే 11,450.85 కోట్లు విడుదల అయ్యాయి. అయితే ఇందులో కూడా కేంద్రం తిరకాసు పెట్టిందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. అంతకుముందు ఏడాది రూ. 29 వేల కోట్లకుపైగా ఉన్న అంచనా గతేడాదికి వచ్చేసరికి రూ. 8,177 కోట్లకు తగ్గిందని, అయినా కేంద్రం ఇచ్చింది రూ. 11 వేల కోట్లేనని వారంటున్నారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అంచనా కంటే రూ. 3,300 కోట్లు ఎక్కువ వచ్చినా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రూ. 2,900 కోట్లు తగ్గిందని చెబుతున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రూ. 14,338.9 కోట్ల వాటా వస్తుందని అంచనా వేస్తే కేంద్రం ఇచ్చింది రూ. 11,450.85 కోట్లు మాత్రమేనని కాగ్ ఇటీవల వెల్లడించిన లెక్కలు కూడా స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలపట్ల ఉదారంగా వ్యవహరించి నిధులివ్వాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇతోధికంగా సాయం చేయకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనుగడ కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment