వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం రూల్స్‌ | 100 people per session, electoral rolls and mobile sites | Sakshi
Sakshi News home page

సెంటర్‌కు వంద టీకాలు

Published Mon, Dec 14 2020 5:31 AM | Last Updated on Mon, Dec 14 2020 4:47 PM

100 people per session, electoral rolls and mobile sites - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే  వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త సంవత్సరంలో మొదలయ్యే ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తొలివిడత జూలై వరకు కొనసాగుతుందని, ఈ విడతలో 25 నుంచి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టుగా  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. ప్రస్తుతం దేశంలో తొమ్మిది వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉండగా మూడు కంపెనీల వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి.

మార్గదర్శకాలు..
► ఒక్కో వ్యాక్సిన్‌ కేంద్రంలో ఒకే రోజు వంద మందికి, అవసరమైతే 200 మందికి  టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
► వ్యాక్సిన్‌ తీసుకునేవారు  కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కో–విన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి
► హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50 ఏళ్ల వయసుపైబడిన వారికి తొలి దశలో వ్యాక్సిన్‌ ఇవ్వాలి. ఎన్నికల ఓటర్ల జాబితాను బట్టి 50 ఏళ్ల వయసు పైబడిన వారిని గుర్తించాలి.
► 50 ఏళ్ల వయసు ఉన్న వారిని కూడా మళ్లీ రెండు గ్రూపులుగా విభజించాలి. తొలుత 60 ఏళ్లకి పైబడిన వారికి ఇవ్వాలి.
► వ్యాక్సినేషన్‌ బృందంలో వ్యాక్సినేటర్‌ ఆఫీసర్, స్టాఫ్‌ నర్స్, ఫార్మాసిస్ట్, ఆగ్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్, లేడీ హెల్త్‌ విజిటర్‌లు ఉంటారు. వీరే కాకుండా పోలీసు శాఖకు చెందిన వారు సహాయకులుగా ఉంటారు.
► వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.


జనవరి నుంచి వ్యాక్సినేషన్‌కు చాన్స్‌ : సీరమ్‌ చీఫ్‌ అదార్‌ పూనావాలా
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దేశంలో జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) చీఫ్‌ అదార్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ నాటికి మళ్లీ కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయన్నారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి సంబంధించి అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు. దేశ జనాభాలో 20% మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగానే సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement