
బన్సీలాల్‌పేట్: వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బిహార్ వంటి సుదూర రాష్ట్రాలకు బస్సుల్లో వలస కూలీలను తరలించడం కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. గురువారం సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో అధికారులతో కలసి నూతన రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మార్గదర్శకాల పేరిట వలస కూలీల తరలింపు బాధ్యతను రాష్ట్రాలపై మోపీ చేతులు దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించి ప్రత్యేక రైళ్లలో ఉచితంగా వారిని స్వస్థలాలకు చేర్చాలన్నారు. వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చే విషయం లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు బాధ్యతారాహిత్యంగా, అసం బద్ధంగా, ఆచరణకు సాధ్యం కాని గాలిమాటల్లా ఉన్నాయన్నారు. ఓ ఆర్డర్ పాస్ చేశాం.. రాష్ట్రాలు అవి అమలు చేయాలని కేంద్రం కోరడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించి లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రశ్నకు తలసాని బదులిచ్చారు.