న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి ట్విట్టర్ అకౌంట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై సామాజిక మాధ్యమం ట్విట్టర్ చర్యలు మొదలు పెట్టింది. మొత్తం 500 మంది ట్విట్టర్ ఖాతాలను రద్దు చేసినట్టుగా తన బ్లాగ్‌లో ట్విట్టర్ పేర్కొంది. భారత్‌లో మరికొంత మందికి ట్విట్టర్‌తో యాక్సెస్ లేకుండా నిరోధించింది. అదే సమయంలో వినియోగదారుల స్వేచ్ఛను కాపాడతామని ట్విట్టర్ పేర్కొంది. వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతల ఖాతాల్ని నిరోధించలేమంది. అలా చేస్తే భారత రాజ్యాంగం వారికి ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసినట్టేనని ట్విట్టర్ కేంద్రానికి బదులిచ్చింది. రైతు ఉద్యమంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్, ఖలిస్తాన్ మద్దతుదారులకు చెందిన 1,178 ఖాతాలపై నిషేధం విధించాలని ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ సంస్థని ఆదేశించింది. రైతు నిరసనలపై తప్పుడు ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని కేంద్రం ట్విట్టర్‌కి తెలిపింది. దీనిపై ట్విట్టర్ చర్యలు చేపడుతూ మొత్తం 500 మంది అకౌంట్లను నిషేధించింది. కొంత మంది ఖాతాల్లో విద్వేషపూరిత ట్వీట్లను తొలగించింది.
‘కూ’లో స్పందించిన కేంద్రం
అమెరికాకి చెందిన ట్విట్టర్ సంస్థ తన చర్యలన్నింటినీ బ్లాగ్‌లో పేర్కొనడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఈ అంశంపై కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో అపాయింట్‌మెంట్ కోరిన ట్విట్టర్ ఇలా బ్లాగ్‌లో పోస్టు చెయ్యడం అసాధారణమని ఐటీ శాఖ పేర్కొంది. ఐటీ శాఖ తన స్పందనని దేశీయంగా తయారు చేసిన ట్విట్టర్ తరహా ‘కూ’ యాప్‌లో పోస్టు చేసింది. కేంద్రం తన స్పందనని కూ యాప్‌లో ఉంచడంతో ఈ యాప్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు
Published Thu, Feb 11 2021 6:34 AM | Last Updated on Thu, Feb 11 2021 9:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment