బుధవారం ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద రహదారిపై రైతుల వాహనాలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరోవిడత చర్చలకు ముందు రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉదయం రైతు సంఘాలకు కొన్ని ప్రతిపాదనలను పంపించింది. వ్యవసాయ చట్టాల రద్దు కుదరదని అందులో స్పష్టం చేసింది. ప్రతిగా, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సవరణలకు సిద్ధమని పేర్కొంది.
కనీస మద్దతు ధర విధానం కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇస్తామని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదనలను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే తమ ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రం చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. అందుకు ఒక కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో రెండు వారాలుగా వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.
కొత్తవేం లేవు
ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన అనంతరం రైతు నేతలు విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రతిపాదనల్లో కొత్తవేం లేవని, గతంలో చర్చల సందర్భంగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవే ప్రతిపాదనలను తమ ముందు ఉంచారని వివరించారు. వాటిని ‘సంయుక్త కిసాన్ కమిటీ’ పూర్తిగా తిరస్కరిస్తోందని రైతు నేత శివ కుమార్ కక్కా తెలిపారు. ఆ ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా రైతులను అవమానించేవిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం నుంచి కొత్తగా ఏవైనా ప్రతిపాదనలు వస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా, డిసెంబర్ 14న ఉత్తరాది రాష్ట్రాల రైతులు ‘ చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడ్తారని, దక్షిణాది రాష్ట్రాల రైతులు స్థానిక జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుపడంతో పాటు, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తారని రైతు నేతలు తెలిపారు. అలాగే, డిసెంబర్ 12న అన్ని టోల్ ప్లాజాల వద్ద ‘టోల్ ఫ్రీ’ కార్యక్రమం చేపడ్తామన్నారు. అదే రోజు ఢిల్లీ –జైపూర్ హైవే, ఢిల్లీ–ఆగ్రా హైవేలను దిగ్బంధిస్తామన్నారు.
పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీలకు చెందిన సంస్థలకు సంబంధించిన సేవలు, ఉత్పత్తులను బహిష్కరించాలని, టెలీకాం సేవలను జియో నుంచి వేరే సంస్థలకు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులను ఘొరావ్ చేయాలని, నాయకుల ఇళ్లు, కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు జరపాలని విజ్ఞప్తి చేశారు. మీడియాలో వస్తున్నట్లు రైతు సంఘాల నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కక్కా స్పష్టం చేశారు.
రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు
రైతు ఆందోళన అంశంపై బుధవారం ప్రతిపక్ష పార్టీల నాయకుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వారు రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, డీఎంకే నాయకుడు టికెఎస్ ఎలంగోవన్ ఉన్నారు. ఆ బిల్లులకు ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదం పొందిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment