
లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కరోనా మహమ్మారి కాటేస్తుందంటూ పౌరులను వినూత్నరీతిలో హెచ్చరిస్తున్న బెంగళూరు పోలీసులు. – బనశంకరి (బెంగళూరు)
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కశ్మీర్, బీహార్‌లతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ మంగళవారం కొత్తగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 1397కు, మరణాల సంఖ్య 35కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 146 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రజలు సహకరించకపోవడంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ హాట్‌స్పాట్స్ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
వైరస్ బారిన పడ్డవారు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు, ఈ హాట్‌స్పాట్స్‌ను దిగ్బంధించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం తెలిపారు. అయితే, ఈ విషయంలో ప్రజలు మరింత సహకారం అందించాలని కోరారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 72 కొత్త కేసులు నమోదు కాగా ఇందులో 59 ముంబైలోనే ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలోనూ ఏడు కొత్త కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 215కు చేరుకుంది. కోవిడ్ కారణంగా కేరళలో మంగళవారం మరొకరు చనిపోయారు. పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలోనూ మరణాలు సంభవించాయి.
కోవిడ్ బారిన పడ్డ వారికి సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి తగినన్ని రక్షణ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, విదేశీ వ్యవహారాల శాఖ దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాంల్లో సరఫరాదారులను గుర్తించిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రుల బృందం నిర్ణయించిందన్నారు. ఏ రాష్ట్రమైనా విజ్ఞప్తి చేస్తే లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేసేందుకు పారామిలటరీ బలగాలను దింపే విషయంపై ఆలోచిస్తామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీవాస్తవ తెలిపారు. తమిళనాడులో మంగళవారం ఒక్కరోజే 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మతప్రార్థనలకు హాజరైన వారు 50 మంది ఉన్నారు.
వీసా నిబంధనలను అతిక్రమిస్తే..
భారతీయ వీసా నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలుంటాయని కేంద్రం హెచ్చరించింది. వీసా నిబంధనలను అతిక్రమించి భారత్‌కు వచ్చిన వారిపై కఠిన చర్యలుంటాయని, వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment