
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14వ తేదీ వరకూ ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై, తప్పుడు ప్రకటనలు చేసేవారిపై రాష్ట్రాలు భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ల కింద కేసులు పెట్టవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. లాక్‌డౌన్ మార్గదర్శకాలు మార్చి 24న జారీ అయ్యాయని, వీటిని ఉల్లంఘించిన వారిపై 2005 నాటి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టంలోని 51వ సెక్షన్ నుంచి 60 సెక్షన్ వరకూ అన్నీ వర్తిస్తాయని స్పష్టంగా ఉందని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఐపీసీలోని సెక్షన్ 188 కింద కూడా ఉల్లంఘనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ఈ రెండు చట్టాలకు సంబంధించిన శిక్షల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. లాక్‌డౌన్‌ను అమలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని, తప్పుడు ప్రకటనలు చేసేవారికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చునని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో నిధులు, వస్తు సామగ్రి దుర్వినియోగం చేస్తే కూడా రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుందని హెచ్చరించారు.