two years jail
-
స్విచ్‌బోర్డ్‌లో రూ. 15 కోట్ల గోల్కొండ వజ్రం
కోల్‌కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్‌బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది. 2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్‌లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్‌ను పిస్తోల్‌తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు. వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్‌బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్‌కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్‌ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే. -
ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు
రాంపూర్: 2019 నాటి రెచ్చగొట్టే ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్(74)కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు జడ్జి శోభిత్ బన్సల్ శనివారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ మిలక్ కొత్వాలీ ప్రాంతం ఖటనగరియా గ్రామంలో బహిరంగ సభలో చేసిన విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటుపడింది. ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసింది. పలు కేసుల్లో దోషిగా ఉన్న ఆజంఖాన్ 27 నెలల పాటు జైలులో ఉన్నారు. 2022 మేలో సుప్రీంకోర్టు ఆజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
లాక్డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14వ తేదీ వరకూ ఉన్న దేశవ్యాప్త లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై, తప్పుడు ప్రకటనలు చేసేవారిపై రాష్ట్రాలు భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద కేసులు పెట్టవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. లాక్డౌన్ మార్గదర్శకాలు మార్చి 24న జారీ అయ్యాయని, వీటిని ఉల్లంఘించిన వారిపై 2005 నాటి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలోని 51వ సెక్షన్ నుంచి 60 సెక్షన్ వరకూ అన్నీ వర్తిస్తాయని స్పష్టంగా ఉందని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఐపీసీలోని సెక్షన్ 188 కింద కూడా ఉల్లంఘనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ఈ రెండు చట్టాలకు సంబంధించిన శిక్షల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. లాక్‌డౌన్‌ను అమలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని, తప్పుడు ప్రకటనలు చేసేవారికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చునని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో నిధులు, వస్తు సామగ్రి దుర్వినియోగం చేస్తే కూడా రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుందని హెచ్చరించారు. -
స్విస్ బ్యాంకు ఖాతా దాచాడని.. రెండేళ్ల జైలు
తనకున్న స్విస్ బ్యాంకు ఖాతా వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు చెప్పకుండా దాచిపెట్టినందుకు డెహ్రాడూన్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణం యజమానికి అక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రాజ్పూర్ రోడ్డులో నగల దుకాణం ఉన్న రాజు వర్మకు రూ. 50 వేల జరిమానా కూడా విధించారు. అతడి బ్యాంకు ఖాతాలో 2006 నాటికి రూ. 92 లక్షల మొత్తం ఉందని, ఆ విషయాన్ని అతడు వెల్లడించలేదని ఆదాయపన్ను శాఖ కోర్టుకు తెలిపింది. పన్ను ఎగవేతకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడం, తప్పుడు ప్రకటనలు తదితర నేరాలకు పాల్పడినట్లు అతడి మీద కేసు రుజువైంది. పైకోర్టులో అప్పీలు చేసుకోడానికి వీలుగా అతడికి నెల రోజుల బెయిల్ మంజూరు చేశారు. రాజు వర్మకు స్విట్జర్లాండులో సొంత ఖాతా ఉందని 2012 సంవత్సరంలో ఆదాయపన్ను శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అతడు అప్పటివరకు ఆదాయపన్ను శాఖ అధికారులకు వెల్లడించలేదు. కర్జన్ రోడ్డులోని ఆయన ఇంటిపై అధికారులు 2012 మార్చి 14న సోదాలు చేశారు. స్విస్ బ్యాంకు ఖాతాకు సంబంధించిన పత్రాలను అప్పుడే స్వాధీనం చేసుకున్నారు.