
కోల్‌కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్‌బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది.
2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్‌లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్‌ను పిస్తోల్‌తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు.
వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్‌బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్‌కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్‌ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే.
Comments
Please login to add a commentAdd a comment