Hot Spots
-
5 నిమిషాల్లో కరోనా పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్ణయించింది. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం, పెద్దఎత్తున పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2.20 లక్షల మందికి సరిపోయేలా కిట్ల కోసం ప్రభుత్వం ఆర్డర్లు పెట్టింది. వీటి ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అక్కడికక్కడే ర్యాపిడ్ కరోనా టెస్ట్ చేస్తారు. ఐదు నిమిషాల్లో పాజిటివ్ లేదా నెగెటివ్ అనేది తెలుస్తుంది. ఈ పరీక్షను రక్త నమూనాల ఆధారంగా చేస్తారు. దీన్నే యాంటీబాడీ రక్త ఆధారిత పరీక్ష అని కూడా అంటారు. అంటే ఆ వ్యక్తి శరీరంలోకి వైరస్ ప్రవేశించిందా లేదా ప్రభావితమైందా అనేది ఈ ర్యాపిడ్ టెస్ట్‌ల ఉద్దేశం. ఈ పరీక్షలను కరోనా వైరస్ పాజిటివ్ అత్యధికంగా నమోదైన ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. అందుకోసం అత్యధికంగా పాజిటివ్ నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గుర్తించే పనిలో ఇప్పటికే నిమగ్నమైంది. పరీక్షల ప్రక్రియ ఇలా.. ఇప్పటికే హైదరాబాద్ సహా వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో హాట్స్పాట్లను గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ గుర్తిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లోనే ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ర్యాపిడ్ టెస్టుల్లో ఒకవేళ పాజిటివ్ వస్తే తక్షణమే, హైదరాబాద్‌లోని నిర్ణీత ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ గొంతుల్లోంచి స్వాబ్ తీసి రియల్ టైం పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీ–పీసీఆర్) పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాజిటివ్ వస్తే హైదరాబాద్‌లో చికిత్స చేస్తారు. ఇక ర్యాపిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చినా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వారిని హోం క్వారంటైన్లో 14 రోజులు ఉంచాలని ఐసీఎంఆర్ సూచించింది. వారికి లక్షణాలు అధికంగా ఉంటే హైదరాబాద్‌లో ఆర్టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వారు హోం క్వారంటైన్ పూర్తయ్యాక తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహించాకే బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఐసీఎంఆర్ సూచించింది. జాతీయస్థాయిలో ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్ ఈ పరీక్ష ప్రక్రియను వేగవంతం చేస్తోంది. హైదరాబాద్‌లో హాట్స్పాట్లివే.. రెండ్రోజుల క్రితం వరకు 25 హాట్స్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు గుర్తించాయి. ఇంకా అనేక జిల్లాల్లో వీటిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన యూసఫ్‌గూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్, దారుషిఫా, మహేంద్రహిల్స్, సికింద్రాబాద్ ఎంజే రోడ్, నాంపల్లి, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్‌పేట, నారాయణగూడ, ఖైరతాబాద్, మణికొండ, రాజేంద్రనగర్, షాద్‌నగర్, కుత్బుల్లాపూర్, టోలిచౌకి, చార్మినార్, ఫిలింనగర్ బస్తీ, బేగంపేట, నాచారం, కొత్తపేట, పీఅండ్‌టీ కాలనీ, అంబర్‌పేట ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసుల సంఖ్య మరో నాలుగైదు రోజుల్లో పెరిగే పరిస్థితి ఉన్నందున మరికొన్ని ప్రాంతాలను గుర్తించే అవకాశముంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వేచేసి ర్యాపిడ్ టెస్ట్‌లు చేసే విషయమై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదు. ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్ రెడ్‌జోన్‌లోనే ఉన్నట్టుగానే భావిస్తున్నారు. హాట్స్పాట్లకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పగించామని అధికారులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో.. వరంగల్ అర్బన్ జిల్లాలో జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి, మండిబజార్, పోచంమైదాన్, చార్బౌలి, కాశీబుగ్గ, గణేష్‌నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శాంబునిపేట, బాపూజీనగర్, చింతగట్టు క్యాంప్‌లను హాట్స్పాట్లుగా గుర్తించారు. వీటినే నో మూమెంట్ జోన్లుగా అక్కడి అధికారులు పిలుస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కాలనీలను గుర్తించి ఎనెన్ని ఇళ్లలో సర్వే చేయాలో కూడా నిర్ణయించారు. ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదైన నిజామాబాద్‌లో ఆర్యానగర్, మాలపల్లి, ఖిల్లారోడ్ను కూడా హాట్స్పాట్లుగా గుర్తించినట్లు తెలిసింది. కరీంగనగర్ జిల్లాలోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా అధికారులు హాట్స్పాట్లను గుర్తించినట్లు సమాచారం. తక్కువ కేసులున్న ప్రాంతాల్లో పాజిటివ్ వ్యక్తులున్న ఇళ్లకు మూడు కిలోమీటర్ల మేర హాట్‌స్పాట్‌గా ప్రకటించి కంటైన్మెంట్ ప్రణాళికను అమలుచేస్తారు. ఇంటింటికి వెళ్లి వైరస్ లక్షణాలున్న వారికి ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. -
వైరస్ హాట్ స్పాట్స్ పెరుగుతున్నాయి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కశ్మీర్, బీహార్‌లతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ మంగళవారం కొత్తగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 1397కు, మరణాల సంఖ్య 35కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 146 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రజలు సహకరించకపోవడంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ హాట్‌స్పాట్స్ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ బారిన పడ్డవారు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు, ఈ హాట్‌స్పాట్స్‌ను దిగ్బంధించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం తెలిపారు. అయితే, ఈ విషయంలో ప్రజలు మరింత సహకారం అందించాలని కోరారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 72 కొత్త కేసులు నమోదు కాగా ఇందులో 59 ముంబైలోనే ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలోనూ ఏడు కొత్త కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 215కు చేరుకుంది. కోవిడ్ కారణంగా కేరళలో మంగళవారం మరొకరు చనిపోయారు. పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలోనూ మరణాలు సంభవించాయి. కోవిడ్ బారిన పడ్డ వారికి సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి తగినన్ని రక్షణ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, విదేశీ వ్యవహారాల శాఖ దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాంల్లో సరఫరాదారులను గుర్తించిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రుల బృందం నిర్ణయించిందన్నారు. ఏ రాష్ట్రమైనా విజ్ఞప్తి చేస్తే లాక్డౌన్ నిబంధనలను అమలు చేసేందుకు పారామిలటరీ బలగాలను దింపే విషయంపై ఆలోచిస్తామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీవాస్తవ తెలిపారు. తమిళనాడులో మంగళవారం ఒక్కరోజే 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మతప్రార్థనలకు హాజరైన వారు 50 మంది ఉన్నారు. వీసా నిబంధనలను అతిక్రమిస్తే.. భారతీయ వీసా నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలుంటాయని కేంద్రం హెచ్చరించింది. వీసా నిబంధనలను అతిక్రమించి భారత్‌కు వచ్చిన వారిపై కఠిన చర్యలుంటాయని, వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. -
‘హాట్ స్పాట్’ అంతటా నెట్!
గ్రేటర్ నెటి(సిటీ)జన్లకు శుభవార్త. స్మార్ట్ ఫోన్..ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్...వీటిలో ఏ ఒక్కటి మీ చెంత వున్నా, ఏ మూలన మీరున్నా..సులభంగా ‘నెట్టు’కు రావచ్చు. హాయిగా ఇంటర్నెట్ను ఎంజాయ్ చేయొచ్చు. డిసెంబర్‌లోగా నగరమంతటా వై ఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 60 హాట్ స్పాట్లు సేవలందిస్తుండగా...వాటిని ఏకంగా రెండు వేలకు పెంచనున్నారు. ఒక హాట్‌స్పాట్ పరికరం పరిధిలో ఒకేసారి 500 మంది 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. - గ్రేటర్ వ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు - డిసెంబర్‌లోగా అందుబాటులోకి - చర్యలు చేపట్టిన ఐటీ శాఖ - నగరం నలుమూలలా రెండు వేల హాట్స్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వ్యాప్తంగా డిసెంబరులోగా తొలి అరగంట ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నగరంలో కీలకమైన పర్యాటక, దర్శనీయ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. మాదాపూర్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇప్పటికే వై-ఫై సేవలు అందుబాటులోకి రాగా.. మంగళవారం నుంచి చార్మినార్, గాంధీ ఆస్పత్రి, నిమ్స్, బిర్లామందిర్, బిర్లా మ్యూజియం, బిర్లా ప్లానెటోరియం, పబ్లిక్ గార్డెన్స్‌లో అరగంట ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. కాగా మహానగర వ్యాప్తంగా వై-ఫై సేవలు అందించేందుకు రెండువేల హాట్‌స్పాట్ పరికరాలను బీఎస్ఎన్ఎల్, క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతానికి 60 చోట్ల వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఒక హాట్‌స్పాట్ పరికరం పరిధిలో ఒకేసారి 500 మంది లాగిన్ అయి అత్యాధునిక 5జి సేవలు అందుకునే వీలుంటుందని చెప్పారు. త్వరలో ఈ ప్రాంతాల్లో... నగరంలోని టూరిస్టు హోటళ్లు, తారామతి బారాదరి, శిల్పారామం, శిల్పకళా వేదిక, ఎంజీబీఎస్, జూబ్లీబస్స్టేషన్లలో మరో పక్షం రోజుల్లో వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అరగంటపాటు 300 ఎంబీ సామర్థ్యంగల డేటాను ఉచితంగా వినియోగించుకునే అవకాశం కలగనుంది. ఆ తరవాత ప్రతి అరగంటకు రూ.30 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రీచార్జి కార్డులను బీఎస్ఎన్ఎల్ స్టోర్లలో విక్రయించనున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై సేవలను ప్రస్తుతానికి సుమారు 50 వేల మంది వినియోగించుకుంటున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వై-ఫై అంటే.. వైఫై అంటే.. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ (డబ్ల్యూఐఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆంగ్లభాషలో డబ్ల్యూఎల్‌ఏఎన్‌ను కుదించి ‘వై ఫై’ అని పిలుస్తున్నారు. అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు (66 ఫీట్లు), ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు (330 ఫీట్లు) వరకు అందుతాయి. వైఫైతో కంప్యూటర్లు, వీడియో గేమ్స్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు, కొన్ని రకాల డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్స్, డిజిటల్ ఆడియో ప్లేయర్లు వంటివెన్నో కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా వినియోగించుకోవాలి... - మీ స్మార్ట్‌ఫోన్‌లో వై ఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ మొబైల్ నెంబరును, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్చేయాలి - ఆ తర్వాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. - రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు అరగంటపాటు ఉచితంగా వైఫై సేవలు అందుతాయి. సిగ్నల్స్ ఇలా.. తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్ను నిర్ణీత పరిధిలో వైఫై సౌకర్యం కలిగి ఉన్న ఫోన్లు, కంప్యూటర్లు వంటివాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తాయి. సులువుగా చెప్పాలంటే మనం బ్లూటూత్ ద్వారా ఫోటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట.