ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో శనివారంతో సగం రోజులు పూర్తయ్యాయి. 21 రోజులు పూర్తయ్యాక లాక్‌డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. దేశంలో రైల్వే సర్వీసుల పునరుద్ధరణపై ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశముందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతాం. దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం ఓకే చెప్పాకే రైల్వే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి.
ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తమ విమానాల బుకింగ్‌లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.
దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న దానిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment