Easing
-
లాక్డౌన్ దశలవారీగా సడలింపు!
ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్లో శనివారంతో సగం రోజులు పూర్తయ్యాయి. 21 రోజులు పూర్తయ్యాక లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. దేశంలో రైల్వే సర్వీసుల పునరుద్ధరణపై ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశముందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతాం. దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. లాక్డౌన్ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం ఓకే చెప్పాకే రైల్వే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తమ విమానాల బుకింగ్‌లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న దానిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులతో చర్చించారు. -
వయోపరిమితి సడలింపు పదేళ్లు?
ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఆలోచన యూనిఫాం సర్వీసులకు ఐదేళ్లు సడలింపు! హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయో పరిమితి సడలింపును పదేళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో భర్తీ చేసే పోస్టుల గరిష్ట వయోపరిమితికి పదేళ్లు సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ టీఎస్పీఎస్సీ పరీక్షల విధానం, వయోపరిమితి సడలింపు తదితర అంశాలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. అందులో ఐదేళ్ల సడలింపును ప్రతిపాదించింది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు రానందున.. ఐదేళ్ల సడలింపు సరిపోతుందని, పదేళ్లు పెంచితే కొన్ని కేటగిరీల్లో ఉద్యోగి సర్వీసు కాలం తగ్గిపోతుందని పేర్కొంది. కానీ నిరుద్యోగులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి గరిష్ట వయోపరిమితిని పదేళ్లు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పదేళ్ల సడలింపునకు సీఎం అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు యూనిఫాం (పోలీసు వంటి) సర్వీసుల్లో ఇంతకుముందు గరిష్ట వయోపరిమితిని పెంచలేదు. కానీ ఈసారి వాటిల్లోనూ గరిష్ట వయోపరిమితికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలన్న యోచనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. -
ఉద్యమ కేసుల ఎత్తివేత
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులపై విచారణ లో ఉన్న 47 కేసులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 2009 నుంచి 2013 వరకు కొనసాగిన పలు ఘట నల నేపథ్యంలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను దశల వారీగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలివిడత 47 కేసులు ఎత్తివేసింది. ఈ కేసులతో సం బంధం ఉన్న దాదాపు 250 మందికి విముక్తి కలుగనుంది. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో నమోదు అయిన కేసులను ఎత్తివేశారు.