Railway Service
-
లాక్డౌన్ దశలవారీగా సడలింపు!
ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్లో శనివారంతో సగం రోజులు పూర్తయ్యాయి. 21 రోజులు పూర్తయ్యాక లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. దేశంలో రైల్వే సర్వీసుల పునరుద్ధరణపై ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశముందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతాం. దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. లాక్డౌన్ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం ఓకే చెప్పాకే రైల్వే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తమ విమానాల బుకింగ్‌లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న దానిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులతో చర్చించారు. -
ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని
న్యూఢిల్లీ: రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అధికారి. అశ్వని లొహాని మూడేళ్లపాటు ఎయిర్ ఇండియా సీఎండీగా కొనసాగనున్నారు. ఈయనకు ముందు ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న రోహిత్ నందన్ ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. -
సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించిన రైల్వే జీఎం
చేగుంట, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) శ్రీవాత్సవ శుక్రవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. చేగుంట మండలం వడియారం, తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్లను ఆయన సందర్శించారు. చేగుంట మండలం వడియారం 229వ నంబరు రైల్వే గేటు పనితీరును ఆయన పరిశీలించారు. సికింద్రాబాద్ నిజామాబాద్ మార్గంలో రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం వడి యారం పరిధిలో పనిచేస్తున్న గ్యాంగ్ మెన్లతో ఆయన మాట్లాడారు. వారి క్వార్టర్స్ సౌకర్యాల పట్ల వివరాలు అడిగారు. జూనియర్ గ్యాంగ్‌మన్లకు రైల్వే లైన్ నిర్వహణ పట్ల సీనియర్లు అవగాహన కల్పించాలని సూచించారు. గేటు వద్ద ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థ గేటు బయట ఉన్న పరిసరాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ ఆఫ్ సెఫ్టీ, రైల్వే డిపార్ట్మెంట్ డీకే సింగ్, శ్రీహరి, సీఎస్ఓ సాహూ, ఇంజనీర్ శ్రీనువాసురావు, ఎస్పీ రంగారావు, ఏఎస్పీ సయ్యద్ ఖదీర్‌తో పాటు రైల్వే శాఖకు చెందిన పలువురు ఇంజనీర్లు, రైల్వే పోలీసులు ఉన్నారు. జీఎంకు వినతి పత్రం తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్‌లను నిలపాలని, అదనపు రైళ్లు నడపాలని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, తూప్రాన్ - శివ్వంపేట మండలాలకు చెందిన సర్పంచ్‌లు, వ్యాపారులు, విద్యార్థులు శ్రీవాత్సవ్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. మనోహరాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా వెళుతున్న శ్రీవాత్సవ్ స్టేషన్లో ఆగకుండా వెళుతుండడంతో స్థానికులు రైలును అడ్డుకున్నారు. అనంతరం ఆయన రైలు దిగి వారి నుంచి వినతి పత్రాలను సేకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి వచ్చిన రైలులో వెళ్లిపోయారు. అక్కన్న పేటలో ఏసీఎం రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఏసీఎం (అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్) భాను ప్రకాష్ శుక్రవారం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ నెల 19న అక్కన్నపేట - మెదక్ రైల్వే లైన్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే, దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు మెదక్ ఎంపీ విజయశాంతిలు అక్కన్నపేట రైల్వే స్టేషన్‌గా మీదుగా మెదక్ వెళుతుండడంతో ఆయన స్థానిక స్టేషన్‌ను సందర్శించారు.