చేగుంట, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) శ్రీవాత్సవ శుక్రవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. చేగుంట మండలం వడియారం, తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్లను ఆయన సందర్శించారు. చేగుంట మండలం వడియారం 229వ నంబరు రైల్వే గేటు పనితీరును ఆయన పరిశీలించారు. సికింద్రాబాద్ నిజామాబాద్ మార్గంలో రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం వడి యారం పరిధిలో పనిచేస్తున్న గ్యాంగ్ మెన్లతో ఆయన మాట్లాడారు. వారి క్వార్టర్స్ సౌకర్యాల పట్ల వివరాలు అడిగారు. జూనియర్ గ్యాంగ్‌మన్లకు రైల్వే లైన్ నిర్వహణ పట్ల సీనియర్‌లు అవగాహన కల్పించాలని సూచించారు. గేటు వద్ద ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థ గేటు బయట ఉన్న పరిసరాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ ఆఫ్ సెఫ్టీ, రైల్వే డిపార్ట్‌మెంట్ డీకే సింగ్, శ్రీహరి, సీఎస్‌ఓ సాహూ, ఇంజనీర్ శ్రీనువాసురావు, ఎస్‌పీ రంగారావు, ఏఎస్పీ సయ్యద్ ఖదీర్‌తో పాటు రైల్వే శాఖకు చెందిన పలువురు ఇంజనీర్లు, రైల్వే పోలీసులు ఉన్నారు.
జీఎంకు వినతి పత్రం
తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌లను నిలపాలని, అదనపు రైళ్లు నడపాలని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, తూప్రాన్ - శివ్వంపేట మండలాలకు చెందిన సర్పంచ్‌లు, వ్యాపారులు, విద్యార్థులు శ్రీవాత్సవ్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. మనోహరాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా వెళుతున్న శ్రీవాత్సవ్ స్టేషన్‌లో ఆగకుండా వెళుతుండడంతో స్థానికులు రైలును అడ్డుకున్నారు. అనంతరం ఆయన రైలు దిగి వారి నుంచి వినతి పత్రాలను సేకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి వచ్చిన రైలులో వెళ్లిపోయారు.
అక్కన్న పేటలో ఏసీఎం
రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఏసీఎం (అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్) భాను ప్రకాష్ శుక్రవారం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ నెల 19న అక్కన్నపేట - మెదక్ రైల్వే లైన్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే, దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు మెదక్ ఎంపీ విజయశాంతిలు అక్కన్నపేట రైల్వే స్టేషన్‌గా మీదుగా మెదక్ వెళుతుండడంతో ఆయన స్థానిక స్టేషన్‌ను సందర్శించారు.
సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించిన రైల్వే జీఎం
Published Sat, Jan 18 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement