
నిజం చెప్పాలంటే, శ్లోక్ శ్రీవాస్తవ ఇంతలా ఎప్పుడూ కృంగిపోలేదు. దిల్లీలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవాస్తవకు ఐఐటీ,దిల్లీలో సీటు రాకపోవడం శరాఘాతంలా పరిణమించింది. తల్లిదండ్రులు ఏమీ అనకపోయినా, ధైర్యం చెప్పినా తనలో అంతులేని బాధ.
అలా రెండు నెలలు...దుఃఖమయ సమయం.
Forbes India 30 Under 30 in 2022: తనను తాను చీకటిగుహలో నుంచి వెలుగు వాకిట్లోకి తీసుకురావడానికి విజేతల ఆత్మకథలు చదవడం మొదలు పెట్టాడు. వాళ్లెవరూ పుట్టు విజేతలు కాదు. జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాళ్లు. విజేతలకు సంబంధించి రకరకాల పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు... ‘నీ లక్ష్యం మీద నీకు స్పష్టత ఉంటే నీ దగ్గరకు విజయం...నడిచిరావడం కాదు పరుగెత్తుకు వస్తుంది’ అనే వాక్యం తనకు బాగా నచ్చింది. ఆ సమయంలో ఆలోచించాడు ‘అసలు నా లక్ష్యం ఏమిటీ?’ అని. ఆ విషయంపై తాను ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అభిరుచి నుంచి లక్ష్యం పుడుతుంది...అంటారు. తన అభిరుచి విషయంలో మాత్రం స్పష్టత ఉంది. తనకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. యూట్యూబ్ వీడియోలు రూపొందించడం అంటే ఇష్టం. వీటిలో ఏముంది ప్రత్యేకత? ప్రత్యేకత ఆవిష్కరించడమే కదా విజేత పని!
∙∙
చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో శ్లోక్‌కు అడ్మిషన్ దొరికింది. యూనివర్శిటీలో ఉన్న కాలంలో...ఒకవైపు చదువుపై శ్రద్ధ పెడుతూనే మరోవైపు డిజైన్, థియేటర్, కోర్స్ మేకింగ్ యూట్యూబ్ వీడియోలను చేయడం మొదలుపెట్టాడు. గ్యాడ్జెట్‌లను పరిచయం చేయడానికి ‘టెక్ బర్నర్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. గ్యాడ్జెట్‌ల పరిచయం వ్యాపార ప్రకటనల్లా కాకుండా...ఎంటర్‌టైనింగ్, స్టోరీ టెల్లింగ్ పద్ధతుల్లో పరిచయం చేసేవాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. అప్పుడప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేయకుండా పూర్తిస్థాయిలో సమయాన్ని చానల్‌కు కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది వారి కుటుంబసభ్యులకు నచ్చలేదు. సర్దిచెప్పాడు. కెమెరా ముందు ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? నాణ్యమైన వీడియోలు ఎలా రూపొందించాలి....మొదలైన విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాడు.
చానల్ సూపర్‌డూపర్ హిట్ అయింది! ప్రతి నెల 50 మిలియన్‌ల వ్యూయర్‌షిప్ వచ్చింది. ఈ ఉత్సాహంలో రెండు వెబ్‌సైట్‌లు, బర్నర్ మీడియా బ్యానర్‌పై ఆన్‌లైన్ అప్లికేషన్‌లు లాంచ్ చేశాడు. ‘టెక్ బర్నర్’ అనేది అతడి పేరుకు ప్రత్యామ్నాయం అయింది. ఈ పేరుతోనే అతడిని పిలుస్తుంటారు. ‘ఉద్యోగం వద్దు అనుకున్నప్పుడు...రిస్క్ చేస్తున్నావు అని ఎంతోమంది హెచ్చరించారు. రిస్క్ అని వెనక్కి తగ్గితే ఏమీ చేయలేము అనే విషయం తెలుసు. దీనికి కారణం నేను చేస్తున్న పనిపై నాకు ఉన్న సంపూర్ణ నమ్మకం. బరిలో మంచి టాలెంట్ ఉన్న ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు. అయితే నాకు ఒక నమ్మకం... నాకంటూ ఎక్కడో ఒకచోట స్థానం ఉంటుందని. దానికోసం వెదికాను. విజయం సాధించాను’ అంటున్న శ్లోక్ శ్రీవాస్తవ ‘ఫోర్బ్స్’ ఇండియన్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment