
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్‌గా అరుణ్‌కుమార్ జైన్ బాధ్యతలు చేపట్టారు. జోన్ జీఎం గజానన్ మాల్యా ఇటీవలే పదవీ విరమణ పొందడంతో తాత్కాలికంగా నైరుతి రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ రెండు నెలలుగా అదనపు బాధ్యతలతో జీఎంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏజీఎం అరుణ్‌కుమార్ జైన్‌కు జీఎం స్థాయి హోదా కల్పిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో అరుణ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 1986 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజినీర్‌గా, హైదరాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. ఇతర జోన్లలో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.