న్యూఢిల్లీ: బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా అంబుడ్స్‌మన్ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పాలసీదారులు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలను సవరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. అంబుడ్స్‌మన్‌కి కేవలం వివాదాలపైనే కాకుండా బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు, ఇతరత్రా మధ్యవర్తులు అందించే సేవల్లో లోపాలపైన కూడా ఫిర్యాదు చేసే విధంగా కంప్లైంట్ల పరిధిని విస్తృతం చేసినట్లు వివరించింది.
ఇన్సూరెన్స్ సేవల్లో లోపాలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం, తక్కువ వ్యయాలతో, నిష్పక్షపాతంగా పరిష్కరించే విధంగా బీమా రంగ అంబుడ్స్‌మన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలు–2017కి ఈ మేరకు సమగ్రమైన సవరణలు చేసినట్లు పేర్కొంది. నిర్దిష్ట సవరణల ప్రకారం.. పాలసీదారులు ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఆయా ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే తెలుసుకునేలా ప్రత్యేక మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉంటుంది. వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా అంబుడ్స్‌మన్ విచారణ నిర్వహించవచ్చు. అంబుడ్స్‌మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి స్వతంత్రంగా, సమగ్రంగా జరిగే విధంగా తత్సంబంధ నిబంధనలను సవరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బీమా రంగంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషి చేసిన వారిని కూడా సెలక్షన్ కమిటీలో చోటు ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment