పార్లమెంటులో బీజేపీ ఎంపీ మహేశ్ శర్మకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ: కోవిడ్–19తో మరణించిన వారి మృతదేహాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, మృతదేహం వద్ద పనిచేసే వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. వాటిలో ముందు జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ నివారణ, వాతావరణం వైరస్‌తో కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మొదలైనవి ఉన్నాయి. ‘దగ్గు, తుమ్ము సమయంలో వెలువడే డ్రాప్‌లెట్స్ కారణంగానే కరోనా వైరస్ ప్రధానంగా వ్యాపిస్తుంది. మృతదేహం ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయితే, వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పోస్ట్‌మార్టం సమయంలో మృతదేహంలోని ఊపిరితిత్తుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’ అని అందులో వివరించారు.
శ్మశానాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్‌లు, గ్లవ్స్‌ను వినియోగించడం వంటి నిర్ధారిత జాగ్రత్తలు తీసుకోవాలని శ్మశానంలోని సిబ్బందికి వివరించాలన్నారు. మృతదేహాన్ని ముట్టుకోకుండా చివరి చూపు చూడొచ్చని, ఇతర మతపరమైన ప్రక్రియలు కూడా నిర్వహించవచ్చని వివరించారు. మృతదేహానికి స్నానం చేయించడం, హత్తుకోవడం, ముట్టుకోవడం మాత్రం చేయవద్దని హెచ్చరించారు. అంత్యక్రియల అనంతరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా శుభ్రంగా స్నానం చేయాలని సూచించారు. అయితే, అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరుకావడం మంచిది కాదని పేర్కొన్నారు. మత సంప్రదాయాల ప్రకారం నదీజలాల్లో కలిపేందుకు మృతదేహానికి సంబంధించిన బూడిదను సేకరించవచ్చని, దాని వల్ల వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment