గురువారం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో రోడ్‌సేఫ్టీ అధికారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా రూ.500 కోట్ల వరకు రానున్నాయి. ఏప్రిల్ నుంచి దాదాపు ఐదేళ్ల వరకు ఈ నిధులు అందనున్నాయి. గురువారం రాష్ట్ర రోడ్‌సేఫ్టీ విభాగం చైర్మన్ క్రిష్ణప్రసాద్ నేతృత్వంలో ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్డు భద్రత విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డీజీపీ క్రిష్ణప్రసాద్ వారికి వివరించారు. ప్రమాదాలకు కారణంగా నిలుస్తోన్న అతివేగం, బ్లాక్‌స్పాట్లు, నిర్లక్ష్యం తదితర అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తోన్న ఈ బృంద సభ్యులు తెలంగాణ రోడ్‌సేఫ్టీ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందం నివేదిక ఆధారంగా ఏప్రిల్ నుంచి రోడ్‌సేఫ్టీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏటా రూ.400 నుంచి 500 కోట్ల వరకు ప్రత్యేక గ్రాంటును అందజేయనుంది.
ఎన్‌ఆర్‌ఎస్‌పీపై ప్రశంసల వర్షం..
దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం డీజీపీ క్రిష్ణప్రసాద్‌ను నివేదిక రూపొందించమని కోరింది. 6 నెలలపాటు దేశంలోని రోడ్లు, ప్రమాదాలపై అధ్యయనం చేసిన క్రిష్ణప్రసాద్ నేషనల్ రోడ్‌సేఫ్టీ ప్లాన్ (ఎన్‌ఆర్‌ఎస్‌పీ)కి రూపకల్పన చేశారు. దానికి రూ.3,000 కోట్ల మూలధనం, ఏటా రూ.2,000 కోట్ల నిర్వహణ వ్యయంతో ప్రత్యేక నేషనల్ హైవే పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను గురువారం జరిగిన సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. దేశంలో ఎన్‌ఆర్‌ఎస్‌పీ అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీజీ రైల్వేస్ అండ్ రోడ్‌సేఫ్టీ సందీప్ శాండిల్య, జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment