DGP Krishna Prasad
-
రోడ్డు భద్రతకు రూ. 400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా రూ.500 కోట్ల వరకు రానున్నాయి. ఏప్రిల్ నుంచి దాదాపు ఐదేళ్ల వరకు ఈ నిధులు అందనున్నాయి. గురువారం రాష్ట్ర రోడ్‌సేఫ్టీ విభాగం చైర్మన్ క్రిష్ణప్రసాద్ నేతృత్వంలో ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్డు భద్రత విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డీజీపీ క్రిష్ణప్రసాద్ వారికి వివరించారు. ప్రమాదాలకు కారణంగా నిలుస్తోన్న అతివేగం, బ్లాక్స్పాట్లు, నిర్లక్ష్యం తదితర అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తోన్న ఈ బృంద సభ్యులు తెలంగాణ రోడ్‌సేఫ్టీ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందం నివేదిక ఆధారంగా ఏప్రిల్ నుంచి రోడ్‌సేఫ్టీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏటా రూ.400 నుంచి 500 కోట్ల వరకు ప్రత్యేక గ్రాంటును అందజేయనుంది. ఎన్ఆర్ఎస్పీపై ప్రశంసల వర్షం.. దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం డీజీపీ క్రిష్ణప్రసాద్‌ను నివేదిక రూపొందించమని కోరింది. 6 నెలలపాటు దేశంలోని రోడ్లు, ప్రమాదాలపై అధ్యయనం చేసిన క్రిష్ణప్రసాద్ నేషనల్ రోడ్‌సేఫ్టీ ప్లాన్ (ఎన్ఆర్ఎస్పీ)కి రూపకల్పన చేశారు. దానికి రూ.3,000 కోట్ల మూలధనం, ఏటా రూ.2,000 కోట్ల నిర్వహణ వ్యయంతో ప్రత్యేక నేషనల్ హైవే పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను గురువారం జరిగిన సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. దేశంలో ఎన్ఆర్ఎస్పీ అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీజీ రైల్వేస్ అండ్ రోడ్‌సేఫ్టీ సందీప్ శాండిల్య, జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది దీక్షాంత్ పరేడ్‌ను గురువారం సిటీ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, శాఖలో కీలకమైన కమ్యూనికేషన్ విభాగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ రవిగుప్తా, అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, మురళీకృష్ణ, శివప్రసాద్, కమ్యూనికేషన్ డీఐజీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
తగ్గిన మరణాలు.. పెరిగిన జరిమానాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య కంటే గతేడాది మృతుల సం ఖ్య గణనీయంగా తగ్గిందని రోడ్డు భద్రత విభాగం నివేదిక వెల్లడించింది. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారని స్పష్టం చేసింది. బుధవారం రోడ్డు భద్రత డీజీపీ కృష్ణ ప్రసాద్ ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రమాద గణాంకాలను పొందుపరిచినట్టు తెలిపారు. దేశవ్యాప్త ప్రమాద గణాంకాలు.. దేశవ్యాప్తంగా 2014–2016 వరకు జరిగిన ప్రమా దాలు, మృతులపై రోడ్డు భద్రత విభాగం గణాంకాలు విడుదల చేసింది. అదే విధంగా రాష్ట్ర గణాంకాలను సైతం విశ్లేషించింది. 2014లో దేశవ్యాప్తంగా 4.89లక్షల ప్రమాదాలు జరగ్గా.. అందులో 1.39 లక్షలమంది మృత్యువాతపడ్డారు. 2015లో 5.01 లక్షల ప్రమాదాలు జరగ్గా 1.46 లక్షల మంది మృతిచెందారు. 2016లో 4.80లక్షల ప్రమాదాలు జరగ్గా అందులో 1.50 లక్షలమంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 2శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మృతుల సంఖ్యలో 10శాతం తగ్గుదల కనిపిస్తోందని కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రతీ 100 రోడ్డు ప్రమాదాల్లో 2014లో 34 మంది చనిపోతే, 2015లో 33మంది, 2016లో 31మంది, 2017లో 29 మంది మృతి చెందారని తెలిపారు. ఉల్లం‘ఘనమే’..: నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు భారీస్థాయిలోనే జరిమానాలు చెల్లిస్తున్నా రు. ఏటా జరిమానాల చెల్లింపులు 20–30శాతం పెరిగిపోతే గతేడాది మాత్రం 50శాతానికి పైగా పెరిగిన ట్టు రోడ్డు భద్రత విభాగం అధ్యయనంలో తేలింది. -
పసిడిని కాజేయబోయి పట్టుబడ్డారు
ముగ్గురు రైల్వేకూలీలు, ఇద్దరు ఆటోడ్రైవర్ల రిమాండ్ హైదరాబాద్: బంగారు బిస్కెట్లను కాజేయబోయిన ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగింది. ఈ నెల 13న రాత్రి 11 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్లో రైళ్లు, ప్లాట్‌ఫామ్‌లు, ప్రయాణికుల లగేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. భయంతో వణికిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తన నడుంకున్న బెల్టును రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం ముందు వదిలేశాడు. దానిని ఎనకపల్లి రామకృష్ణ అనే రైల్వే కూలి గుర్తించాడు. బెల్టును తెరిచిచూడగా అందులో బంగారు బిస్కెట్లు కనిపించాయి. దీనిని మరో ఇద్దరు రైల్వేకూలీలు గడ్డం నరేశ్, దొడ్డి అంజయ్య కనిపెట్టారు. ముగ్గురూ ఒక కలసి పంచుకోవాలని నిర్ణయించు కున్నారు. సమీపంలోని ఆటోస్టాండ్‌కు వెళ్లి బంగారు బిస్కెట్లు లెక్కపెట్టి పంచుకునే ప్రయత్నం చేశారు. పంపకాల వ్యవహారం లో కొద్దిపాటి తేడాలు రావడాన్ని పక్కనే ఉన్న ఆటోడ్రైవర్లు సయ్యద్ ఇక్బాల్, సయ్యద్ సాబీర్ గమనించారు. తమకు వాటాలు ఇవ్వాలని, లేదంటే పోలీసులకు సమాచారం ఇస్తామని రైల్వేకూలీలను ఆటోడ్రైవర్లు బెదిరించారు. పలు చర్చలు, వాగ్వాదాల అనంతరం చివరకు ఐదుగురు బంగారు బిస్కెట్లను పంచుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దూరంగా ఈ తతంగాన్ని గమనించిన మరొకరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల రంగ ప్రవేశంతో వ్యవహారమంతా బెడిసికొట్టింది. ఎప్పుడు నేరాలు చేయని ముగ్గురు రైల్వేపోర్టర్లు, ఇద్దరు ఆటోడ్రైవర్లు పరాయి సొమ్ముకు ఆశపడి కటకటాలపాలయ్యారు. వీడని మిస్టరీ...: 28 బంగారు బిస్కెట్లు పోలీసుల చేతికి చిక్కి 48 గంటలు గడిచిపోయినా సదరు బంగారం ఎవరిదన్నది తేలలేదు. ఎవరో ఒక వ్యక్తి నడుంబెల్టును ప్రవేశద్వారం వద్దే వదిలి వెళ్లడం మాత్రం చూశామని కూలీలు చెబుతున్నారు. బంగారు బిస్కెట్లు స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి చేరినట్టుగా వాటి మీద ముద్ర ఉందని డీజీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద సీసీ కెమెరాలు లేని కారణంగా బంగారం వదిలివెళ్లిన వ్యక్తిని గుర్తించే అవకాశం లేకుండా పోయిందన్నారు. -
పోలీస్ శాఖలో క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్
అన్ని జిల్లాల్లో అమలుకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యవస్థను పోలీస్ శాఖలోనూ అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. పోలీస్ శాఖ ఎన్ఫోర్స్ మెంట్ విధానంలో క్యాష్‌లెస్‌ను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణ ప్రసాద్, పీసీఎస్ అదనపు డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో శనివారం సమీక్ష జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిష నరేట్ల పరిధిలోని ట్రాఫిక్ విభాగం నిర్వహిస్తున్న ఈ–చలాన్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ కమిషన రేట్లోని ఈ–చలాన్ సాఫ్ట్వేర్, సర్వర్లు, సిబ్బంది శిక్షణపై ఎస్పీలు ఆధ్యయనం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్, ఈ–చలాన్ విధానంపై జిల్లాల పోలీస్ సిబ్బందికి శిక్షణనివ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఖర్చుపై పోలీస్ కంప్యూటర్ సర్వీ సెస్ అదనపు డీజీపీ నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. -
పోలీసుల సూచనలు పాటించండి
ఐటీ మహిళా ఉద్యోగులకు డీజీపీ ప్రసాదరావు విజ్ఞప్తి ఐటీ కారిడార్ పోలీసింగ్ ప్రారంభం చెక్‌పోస్ట్ నమూనా ఆవిష్కరించిన సానియా మీర్జా సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఐదంచెల భద్రతా వ్యవస్థను అమలుచేయడం ద్వారా మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నామని డీజీపీ ప్రసాదరావు చెప్పారు. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు రూపొందించిన వాల్‌పోస్టర్, కరపత్రాలు, లఘు చిత్రాలను సీఐడీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాతో కలిసి మాదాపూర్‌లోని విఐటీపార్క్లో బుధవారం డీజీపీ ఆవిష్కరించారు. ఐటీ మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఐటీ కంపెనీలలో పనిచేసే మహిళా ఉద్యోగులు పోలీసుల సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ఐటీ కంపెనీలు కూడా చర్యలు తీసుకోవడం హర్షనీయమన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే మహిళలకు సదరు కంపెనీ పర్సనల్ డిపార్ట్మెంట్ ఇక్కడి పరిస్థితులను వివరించాలని ఆయన సూచించారు. సైబరాబాద్‌లో అదనంగా మహిళా, శాంతి భద్రత ఠాణాలు త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మహిళల రక్షణ కోసం రూపొందించిన లఘు చిత్రంలో నటించడం తన కర్తవ్యంగా భావించానని ఈ సందర్భంగా సానియా పేర్కొన్నారు. పోలీసు చెక్‌పోస్టు నమూనాను ఆమె ఆవిష్కరించారు. ఐటీ ఉద్యోగుల భద్రతలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యం కావడం మంచి పరిణామమని సీఐడీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ అన్నారు. అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన ‘సైబరాబాద్ ఐటీ కారిడార్ పోలీసింగ్’ బృందాల పెట్రోలింగ్‌ను డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందాలకు ఐదు ప్రత్యేక వాహనాలను ఐటీ కంపెనీలు సమకూర్చాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీసీపీ జి.జానకీషర్మిల, ఏపీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భద్రతా చర్యలపై పి.హైమారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. మహిళా ఉద్యోగుల అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న డీజీపీ ప్రసాదరావు, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ తదితరులు