పోలీసుల సూచనలు పాటించండి
ఐటీ మహిళా ఉద్యోగులకు
డీజీపీ ప్రసాదరావు విజ్ఞప్తి
ఐటీ కారిడార్ పోలీసింగ్ ప్రారంభం
చెక్‌పోస్ట్ నమూనా ఆవిష్కరించిన సానియా మీర్జా
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఐదంచెల భద్రతా వ్యవస్థను అమలుచేయడం ద్వారా మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నామని డీజీపీ ప్రసాదరావు చెప్పారు. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు రూపొందించిన వాల్‌పోస్టర్, కరపత్రాలు, లఘు చిత్రాలను సీఐడీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాతో కలిసి మాదాపూర్‌లోని విఐటీపార్క్‌లో బుధవారం డీజీపీ ఆవిష్కరించారు. ఐటీ మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఐటీ కంపెనీలలో పనిచేసే మహిళా ఉద్యోగులు పోలీసుల సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ఐటీ కంపెనీలు కూడా చర్యలు తీసుకోవడం హర్షనీయమన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే మహిళలకు సదరు కంపెనీ పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఇక్కడి పరిస్థితులను వివరించాలని ఆయన సూచించారు.
సైబరాబాద్‌లో అదనంగా మహిళా, శాంతి భద్రత ఠాణాలు త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మహిళల రక్షణ కోసం రూపొందించిన లఘు చిత్రంలో నటించడం తన కర్తవ్యంగా భావించానని ఈ సందర్భంగా సానియా పేర్కొన్నారు. పోలీసు చెక్‌పోస్టు నమూనాను ఆమె ఆవిష్కరించారు. ఐటీ ఉద్యోగుల భద్రతలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యం కావడం మంచి పరిణామమని సీఐడీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ అన్నారు. అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన ‘సైబరాబాద్ ఐటీ కారిడార్ పోలీసింగ్’ బృందాల పెట్రోలింగ్‌ను డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందాలకు ఐదు ప్రత్యేక వాహనాలను ఐటీ కంపెనీలు సమకూర్చాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీసీపీ జి.జానకీషర్మిల, ఏపీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భద్రతా చర్యలపై పి.హైమారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.
మహిళా ఉద్యోగుల అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న డీజీపీ ప్రసాదరావు, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ తదితరులు