శాస్త్ర శిఖరాలు | Special Story About Women Scientists | Sakshi
Sakshi News home page

శాస్త్ర శిఖరాలు

Published Tue, Mar 3 2020 3:27 AM | Last Updated on Wed, Mar 4 2020 2:51 PM

Special Story About Women Scientists - Sakshi

స్త్రీని వంటింటికే పరిమితం చేస్తే ఆ వంట దినుసులతోనే ప్రయోగాలు చేసి దేశానికి పౌష్టికత్వాన్ని ఇచ్చింది. స్త్రీని చదువుకోనిస్తే కుటుంబానికే వెలుతురు ఇచ్చింది. స్త్రీ ఇంటి నుంచి ప్రయోగశాల వరకు చేరడానికి చాలాకాలమే పట్టింది. కానీ శాస్త్రాన్వేషణలో స్త్రీ దృష్టి తిరుగులేనిదని పదే పదే నిరూపితమైంది. మగవారి ప్రభావం అధికంగా ఉండటం వల్ల చాలామంది మహిళా శాస్త్రవేత్తలు అజ్ఞాతంలోనే ఉండిపోవలసి వచ్చింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సైన్స్‌లో విశేష సేవలు చేసి ఎందరో బాలికలు ఆ రంగం వైపు అడుగుపెట్టేలా నిలిచిన 11 మంది శాస్త్రవేత్తలను గౌరవించుకునేందుకు వారి పేరున కేంద్ర ప్రభుత్వం అధ్యయన పీఠాలను స్థాపించనుంది. ఇది గత నూరేళ్ల కాలంలో స్త్రీలు శాస్త్రవేత్తలుగా చేసిన కృషికి ఒక సత్కారం. ఒక అభివాదం.

బిభా చౌదురి  (1913–1991) ఫిజిక్స్‌

ఆమె పేరును ఓ నక్షత్రానికి పెట్టారు. సెక్స్‌టాన్స్‌ నక్షత్ర మండలంలోని ‘హెచ్‌డీ 86081’ నక్షత్రానికి ఇంటర్నేషనల్‌ అస్ట్రనామికల్‌ యూనియన్‌ బిభా చౌదురి పేరు పెట్టింది. కోల్‌కతాలో జన్మించి అక్కడి యూనివర్శిటీలో ఫిజిక్స్‌ అభ్యసించిన బిభా 1939లో ప్రఖ్యాత బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడ దేవేంద్ర మోహన్‌ బోస్‌తో కలిసి ప్రాథమిక కణమైన బోసాన్లను గుర్తించారు. మాంచెస్టర్‌ యూనివర్శిటీలో పరిశోధనలు చేశాక భారత్‌ తిరిగి వచ్చి టాటా ఇన్‌న్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ఎనిమిదేళ్లపాటు పని చేశారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ పరిశోధనల్లోనూ కీలకపాత్ర పోషించారు. కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో భౌతికశాస్త్ర పాఠాలు చెప్పారు. 1991లో మరణించేంత వరకూ పరిశోధనలు కొనసాగించిన బిభాను ‘జాతి మరచిన ఆణిముత్యం’గా పేర్కొంటారు.

అసిమా ఛటర్జీ (1917–2006) కెమిస్ట్‌

మూర్ఛ వ్యాధితోపాటు, మలేరియా చికిత్సకు ఉపయోగించే మందుల తయారీలో కీలకపాత్ర పోసించిన అసిమా ఛటర్జీ బెంగాల్‌లో జన్మించి తండ్రి ఇష్టం మేరకు వృక్షశాస్త్రంలో ఉన్నత విద్య ను అభ్యసించారు. దేశంలో సైన్స్‌లో డాక్టరల్‌ డిగ్రీ పొందిన తొలి మహిళగా 1944లో రికార్డు సస్టించారు. దిగ్గజ శాస్త్రవేత్తలుగా ఖ్యాతి గడించిన ప్రఫుల్ల చంద్ర రాయ్, సత్యేంద్రనాథ్‌ బోస్‌ల మార్గదర్శనంలో విస్కాన్సిన్, కాల్‌టెక్‌లలో పరిశోధనలు నిర్వహించారు. ప్రకృతి సహజమైన ఉత్పత్తుల రసాయన ధర్మాలపై పని చేసిన అసిమా చక్రవర్తి, కీమోథెరపీ మందులు కూడా అభివృద్ధి చేశారు. సుమారు 400 పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. 1975లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జనరల్‌ ప్రెసిడెంట్‌గానూ వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు కూడా.

రాజేశ్వరి ఛటర్జీ (1922–2010) ఇంజినీరింగ్‌

కర్ణాటక నుంచి ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించిన తొలి మహిళ రాజేశ్వరి ఛటర్జీ. బెంగళూరులోని సెంట్రల్‌ కాలేజీలో బీఎస్సీ హానర్స్, గణితంలో ఎమ్మెస్సీ చదివి మైసూరు యూనివర్శిటీ పరిధిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. 1943లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో పరిశోధక విద్యార్థిగా చేరారు. సమాచార ప్రసార రంగంలో పరిశోధనలు ప్రారంభించి నోబెల్‌ అవార్డు గ్రహీత సర్‌ సి.వి.రామన్‌ నేతృత్వంలో పనిచేశారు. 1947 జూలై నెలలో అమెరికా వెళ్లి అక్కడి మిషిగన్‌ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించారు. పీహెచ్‌డీ తరువాత భారత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో చేరి దేశంలో తొలిసారి సూక్ష్మ తరంగాలపై పరిశోధనలు చేపట్టారు. సైన్స్‌ పుస్తకాలు రాశారు. వసుధైక కుటుంబకం పేరుతో రాజేశ్వరి కొంతమంది మహిళలు, పురుషులకు సంబంధించిన వాస్తవ కథనాలను అక్షరబద్దం చేయడం ఒక విశేషంగా చెప్పుకోవాలి.

అన్నా మణి (1918–2001) మెటరాలజిస్ట్‌

భౌతిక, వాతావరణ శాస్త్రవేత్తగా అన్నా మణి చిరపరిచితురాలు. వాతావరణ శాస్త్రానికి ఉపయోగపడే పలు పరికరాల తయారీలో కీలకపాత్ర పోషించారు. సూర్యుడి రేడియోధార్మికత, ఓజోన్‌లతోపాటు పవనశక్తిని కొలిచే విషయంపై పలు పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. తమిళనాడులోని రామనాథపురంలో పుట్టిన అన్నా మణి మద్రాస్‌లోని పాచియప్ప కాలేజీ నుంచి భౌతికశాస్త్ర, రసాయన శాస్త్ర విద్యను అభ్యసించారు. 1940లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, ఆ తరువాత లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలోనూ చదువుకున్నారు. ఇంపీరియల్‌ కాలేజీలో ఉండగానే వాతావరణ శాస్త్ర పరికరాల తయారీపై మక్కువ పెంచుకున్నారు. మహాత్మాగాంధీ, జాతీయోద్యమ స్ఫూర్తితో వాతావరణ పరిశోధనల విషయంలో దేశం స్వావలంబన సాధించాలని నిర్ణయించుకున్న అన్నా మణి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సుమారు వంద పరికరాల డిజైన్లను సిద్ధం చేశారు. తుంబా రాకెట్‌ స్టేషన్‌లో వాతావరణ కేంద్రం ఏర్పాటు చేయడంలో అన్నా మణిదే కీలకపాత్ర. అవివాహితగానే మిగిలిపోయిన అన్నా మణి 1969లో భారత వాతావరణ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1975లో ప్రపంచ వాతావరణ విభాగం సలహాదారుగా ఈజిప్టులో పనిచేశారు కూడా.

దర్శన్‌ రంగనాథన్‌ (1941–2001) ఆర్గానిక్‌ కెమిస్ట్‌

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) డిప్యూటీ డైరెక్టర్‌ (1998–2001)గా పనిచేసిన దర్శన్‌ రంగనాథన్‌ కృత్రిమ రసాయన మూలకాలు, హైబ్రిడ్‌ పెప్టైడ్, నానోట్యూబుల తయారీలో నిష్ణాతులు. సేంద్రీయ రసాయన శాస్త్రవేత్త. ఢిల్లీకి చెందిన దర్శన్‌ మర్కాన్‌ అక్కడే పీహెచ్‌డీ వరకూ చదివారు. ఆ తరువాతి కాలంలో కాన్పూర్‌ ఐఐటీలో ఉండగా.. సహ విద్యార్థి సుబ్రమణియ రంగనాథన్‌ను వివాహమాడి పలు పుస్తకాలు రచించారు. 1993లో త్రివేండ్రంలోని రీజనల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీలో చేరిన దర్శన్‌ ఆ తరువాత 1998లో ఐఐసీటీకి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.  ప్రకృతిలో జరిగే రసాయన ప్రక్రియలను పరిశోధనశాలల్లో కృత్రిమంగా సృష్టించడం.. తద్వారా మానవాళికి ఉపయోగపడే పదార్థాలను సష్టించడం దర్శన్‌ పరిశోధనల ప్రత్యేకత. 1997లో రొమ్ము కేన్సర్‌ బారిన పడ్డ దర్శన్‌ 2001లో తన పుట్టిన రోజైన జూన్‌ నాలుగున మరణించారు. ఫార్మా రంగంలో కీలకమైన ఐమిడజోల్‌ ఉత్పత్తికి ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేశారు.  

కమల్‌ రణదివే (1917–2001) మెడిసిన్‌

కేన్సర్‌కు వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాలను మొట్టమొదట గుర్తించిన బయో మెడికల్‌ రీసెర్చర్‌ కమల్‌ రణదివే. ఇండియన్‌ విమెన్‌ సైంటిస్ట్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక సభ్యురాలు. మహారాష్ట్రలోని పుణేలో జన్మించిన కమల్‌ రణదివే ప్రతిభావంతురాలైన విద్యార్థి కూడా. వైద్యం చదవాలి, వైద్యుడినే పెళ్లి చేసుకోవాలని తండ్రి ఆశించినా కమల్‌ మాత్రం వృక్ష, జంతుశాస్త్రాలను చదువుకున్నారు. 1934లో బీఎస్సీ, ఆ తరువాత పుణేలోని అగ్రికల్చర్‌ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1943లో సైటోజెనిటిక్స్‌లో ఉన్నత విద్యనభ్యసించిన కమల్‌ జె.టి.రణదివేను పెళ్లి చేసుకున్న తరువాత ముంబై వెళ్లిపోయారు. అక్కడే టాటా మెమోరియల్‌ ఆసుపత్రిలో పని చేయడం మొదలుపెట్టారు. 1949లో బాంబే యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ అందుకున్న తరువాత బాల్టీమోర్‌ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ పొందారు. భారత్‌ తిరిగి వచ్చిన తరువాత  ఇండియన్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చేరారు. లుకేమియా, రొమ్ము, గొంతు కేన్సర్లకు కారణాలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించారు. కేన్సర్‌ కణితులకు, వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించారు. బ్యాక్టీరియాపై కమల్‌ చేసిన పరిశోధనల ఆధారంగా కుష్టువ్యాధికి టీకా తయారీ వీలైంది.

రామన్‌ పరిమళ (పుట్టింది 1948 నవంబరు 21) మేథమెటిక్స్‌ 

ఆల్జీబ్రా పేరుచెప్పగానే చాలా మంది మనసులో గాభరా మొదలు కావచ్చునేమోగానీ.. రామన్‌ పరిమళ మాత్రం అందులోనే పుట్టి పెరిగారనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ఏళ్లుగా పనిచేస్తున్న ఈ మహిళ గణిత శాస్త్రవేత్త ఎమొరీ యూనివర్శిటీలోనూ ప్రత్యేక అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారు. తమిళనాడులో పుట్టి మద్రాస్‌లోని శారద విద్యాలయ, స్టెల్లా మేరిస్‌కాలేజీల్లో చదువుకున్న పరిమళ మద్రాస్‌ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ, ముంబై యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు.

కదంబిని గంగూలీ (1861–1923) డాక్టర్‌

దేశంలోనే రెండో మహిళా వైద్యురాలిగా కదంబిని గంగూలీ ప్రసిద్ధురాలు. బ్రిటిష్‌ కాలంలో బిహార్‌లోని భాగల్పూర్‌లో జన్మించిన కదంబిని తండ్రి బ్రజ కిశోర్‌ బసు ఆ కాలంలోనే మహిళ విముక్తి కోసం పోరాటాలు నిర్వహిచిన వ్యక్తి. 1863లోనే భాగల్పూర్‌ మహిళ సమితి పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. బంగ మహిళా విద్యాలయలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత 1878లో కోల్‌కతా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష పాసై ఆ çఘనత సాధించిన తొలి మహిళగానూ కదంబిని రికార్డు సృష్టించారు. తరువాతి కాలంలో కలకత్తా మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించిన ఆమె 1886లో ఆనందీ గోపాల్‌ జోషీ తరువాత వైద్యురాలైన రెండో మహిళగా గుర్తింపు పొందారు. 1892లో ఎడిన్‌బరో, గ్లాస్‌గౌ, డబ్లిన్‌లలో ఉన్నత విద్య అభ్యసించిన తరువాత భారత్‌ తిరిగి వచ్చారు. బ్రహ్మ సమాజ్‌ కార్యకర్త ద్వారకనాథ్‌ గంగూలీని వివాహమాడిన కదంబిని పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1889 నాటి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మహిళల్లో కదంబిని ఒకరు. తన సామాజిక కార్యక్రమాలు, మహిళా విముక్తి పోరాటాలపై సాంఘిక విమర్శలకు గురైనా ఆమె ఉక్కు సంకల్పం మాత్రం సడలలేదు. తనను అనకూడని మాటలతో నిందించిన బంగబషీ పత్రికను కోర్టుకీడ్చి ఆ పత్రిక ఎడిటర్‌ మహేశ్‌ పల్‌కు ఆరునెలల జైలు శిక్ష పడేలా చేసిన ధీర వనిత కదంబిని గంగూలీ.

ఇరావతి కర్వే (1905–1970) ఆంథ్రోపాలజీ 

మానవ విజ్ఞాన శాస్త్రంలో దిగ్గజ శాస్త్రవేత్త ఇరావతి కర్వే. మహారాష్ట్రకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త మహాభారతంలోని పాత్రలను దేవుళ్లుగా కాకుండా చారిత్రక పురుషులుగా భావించి వారి ప్రవర్తన, వ్యక్తిత్వాల ఆధారంగా ఆ కాలం నాటి సమాజాన్ని అధ్యయనం చేశారు. పుణేలోని హుజుర్‌ పాగాలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఫెర్గూసన్‌ కాలేజీలో ఫిలాసఫీ చదువుకున్నారు. తండ్రి ఇష్టాన్ని కాదని దినకర్‌ ధోండో కర్వేను వివాహమాడిన ఇరావతి భర్త సలహా మేరకు జర్మనీకి వెళ్లి పెద్ద చదువులు చదివారు. ఖైసర్‌ వైహెల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రోపాలజీ, హ్యుమన్‌ హెరిడిటీ అండ్‌ యుజెనిక్స్‌లో డాక్టరేట్‌ సాధించి తిరిగి వచ్చారు. నాస్తికుడైన భర్త ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. దేశంలోనే తొలి మహిళా మానవ విజ్ఞాన శాస్త్రవేత్తగా ఇరావతికి రికార్డు ఉంది. జానపదాలను సేకరించడం, వాటిని స్త్రీవాద కవిత్వంగా మలచడం ఇరావతి ఇష్టపడ్డ వ్యాసంగం. దేశంలో రాజరిక వ్యవస్థలపైనా పరిశోధనలు చేసిన ఇరావతి హిందు సమాజంపైనా విస్తృత అధ్యయనాలు నిర్వహించారు. మహాభారత పాత్రల ప్రవర్తన, వ్యక్తిత్వాల ఆధారంగా ఆ కాలపు పరిస్థితులపై యుగాంత పేరుతో తనదైన అంచనా ఇచ్చారు.

అర్చన శర్మ (1932–2008) సైటోజెనెటిసిస్ట్‌

విషతుల్యమైన ఆర్సెనిక్‌ ప్రభావాన్ని మొట్టమొదట అంచనా వేసి ప్రపంచానికి అందించిన జీవకణ శాస్త్రవేత్తగా అర్చన శర్మ సుప్రసిద్ధులు. పుణేలోని విద్యావేత్తల కుటుంబంలో జన్మించిన అర్చన రాజస్థాన్, కోల్‌కతాల్లో విద్యనభ్యసించారు. 1955లో కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన తరువాత మానవ జన్యు శాస్త్రం, పర్యావరణ ప్రభావాలు తదితర అంశాలపై విస్తృతమైన అధ్యయనం చేశారు. దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ బిరుదు (1960) పొందిన రెండో భారతీయ మహిళగా రికార్డు సష్టించారు. కోల్‌కతా యూనివర్శిటీలోనే ప్రొఫెసర్‌గా పనిచేసి ఆ తరువాత 1983లో యూనివర్శిటీ వృక్షశాస్త్ర విభాగానికి అధ్యక్ష స్థానానికి ఎదిగారు. సుమారు 70 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించిన అర్చన శర్మ యూజీసీలో, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ విమెన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్‌ పర్సన్‌గా సేవలందించారు. పదికిపైగా పుస్తకాలు రచించి 300 – 400 పరిశోధన వ్యాసాలు ప్రచురించిన అర్చనశర్మ  దేశంలో కణ జీవశాస్త్ర విభాగానికి ఆద్యుడిగా భావించే అరుణ్‌ కుమార్‌శర్మను వివాహం చేసుకున్నారు. 

జానకీ అమ్మళ్‌ (1897 – 1984) బోటనిస్ట్‌

కేరళ అడవులను జల్లెడ పట్టి వాణిజ్యపరంగానూ, ఔషధాలుగానూ ఉపయోగపడే పలు మొక్కలను అందరికీ అందించిన ఘనత వృక్ష శాస్త్రవేత్త జానకీ అమ్మళ్‌ ఎడలావత కక్కత్‌ది. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం దేశంలో సాగవుతున్న చక్కెర వంగడాల అభివృద్ధి జానకీ అమ్మళ్‌ హయాంలోనే మొదలయ్యాయని చెప్పవచ్చు. మొక్కల వర్గీకరణ మొదలుకొని కణజీవశాస్త్రంలోనూ అమూల్యమైన సేవలందించి పద్మశ్రీ అవార్డుకు వన్నె తెచ్చిన మహిళా శాస్త్రవేత్త. చెరకు, వంగ వంటి పంటలపై జానకీ అమ్మళ్‌ నిర్వహించిన పరిశోధనలు, వాటి ఫలితాలు ఇప్పటికీ అనుసరణీయమైనవే. క్రోమోజోమ్స్‌ ఆఫ్‌ కల్టివేటెడ్‌ ప్లాంట్స్‌ పేరుతో సి.డి.డార్లింగ్టన్‌తో కలిసి ప్రచురించిన పుస్తకం ప్రపంచవ్యాప్త పరిశోధన సంస్థలకు బైబిల్‌ లాంటిది అంటే అతిశయోక్తి కాదు. మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీ తరువాత 1924లో అమెరికాలోని మిషిగన్‌లో స్నాతకోత్తర విద్య తరువాత కొన్నేళ్లపాటు మద్రాస్‌లోని విమెన్స్‌ క్రిస్టియన్‌ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. త్రివేండ్రంలోని మహారాజాస్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్, చక్కెర వంగడాభివృద్ధి కేంద్రం (కోయంబత్తూరు)ల్లోనూ పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్‌లో చిక్కుకుపోయిన జానకీ అమ్మళ్‌ అక్కడే డాక్టర్‌ సి.పి.డార్లింగ్టన్‌తో కలిసి పరిశోధనలు కొనసాగించారు. మీకు తెలుసా.. దేశంలో పలు కొత్త వంగడాల అభివృద్ధికి కృషి చేసిన జానకీ అమ్మళ్‌ పేరుతోనే ఓ రోజా పువ్వు వంగడమూ ఉందని! 1977లో పద్మశ్రీ అవార్డు అందుకున్న జానకీ అమ్మళ్‌ పేరుతో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక అవార్డు కూడా ఏర్పాటు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement