శక్తి స్వరూపం | Special Story About Women Empowerment | Sakshi
Sakshi News home page

శక్తి స్వరూపం

Published Fri, Mar 6 2020 2:16 AM | Last Updated on Fri, Mar 6 2020 4:40 AM

Special Story About Women Empowerment - Sakshi

శక్తికి స్కెచ్‌ గీస్తే స్త్రీ రూపం వస్తుంది. శక్తికి స్క్రీన్‌ప్లే ఇస్తే స్త్రీ రూపకం అవుతుంది. ఎలా చెప్పడం? ఊరికే అనేయడమేనా శక్తి అంటే స్త్రీ అనీ, స్త్రీ అంటేనే శక్తి అని! ఊరికే కాదు. ఇక్కడి ఒక్కో సందర్భం చూడండి. ప్రతి సందర్భంలోనూ మహిళా శక్తి కనిపిస్తుంది. మహిళ.. శక్తి స్వరూపంలా సాక్షాత్కరిస్తుంది.

అంకితభావం
బిడ్డతో డ్యూటీకి
ఏడాది కొడుకు. తల్లిని వదలట్లేదు. తల్లి వదిలి ఉండగలదని కాదు. ఆమెకు డ్యూటీ పడింది. సాదాసీదా డ్యూటీ కాదు. నోయిడాలో ఉత్తరప్రదేశ్‌ సీఎం ఆదిత్యానాథ్‌ హాజరవుతున్న డ్యూటీ. ఆమె పోలీస్‌. రద్దీని నియంత్రించాలి. తోపులాటలు జరక్కుండా చూడాలి. ముఖ్యంగా... తన పై అధికారులకు మాట రాకుండా విధులను నిర్వర్తించాలి. సెలవు పెడతానంటే కుదరదు. అందుకే కొడుకును చంకేసుకుని వచ్చేసింది. అలాగని డ్యూటీకేం తక్కువ చెయ్యలేదు. ఒక చేతిలో బిడ్డ, ఇంకో చేతిలో డ్యూటీ. మొత్తానికి విధి నిర్వహణ విజయవంతమైంది. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఏమైనట్లు? ఆవిడ భర్తేనా?! ఆయనకు ఏదో పరీ„ý  ఉందట. అటు వెళ్లారు. ఈవిడ ఇటు పరీక్షా సమయంలాంటి డ్యూటీకి వచ్చారు.

చైతన్యం

చొరవకు ప్రేరణ
ఆంధ్రప్రదేశ్‌లో ‘దిశ’చట్టం వచ్చాక, మిగతా స్టేట్స్‌లలో కూడా మహిళల కోసం భద్రత దీపాలు వెలుగుతున్నాయి. ఈ మహిళా దినోత్సవానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మహిళలందరికీ ప్యానిక్‌ బట్‌లు పంపిణీ చేస్తోంది. బ్రేస్‌లెట్, నెక్లెస్, ఉంగరం.. ఎక్కడైనా ఆ బటన్‌లను తగిలించుకోవచ్చు. పోకిరీలు ఎవరైనా వేధిస్తుంటే బటన్‌ని నొక్కగానే ఆ సమాచారం వాళ్ల ఫోన్‌ల నుంచి డైరెక్టుగా పోలీసులకు వెళ్లిపోతుంది. తర్వాతి సీన్‌ ఏమిటో మనం ఊహించుకోవచ్చు. ఊహకు అందకపోతే ఈ సీన్‌ని ఒకసారి చూడండి. ఫిబ్రవరి 11, 2020.  ఉదయం 4.21 నిముషాలు. విశాఖనుంచి విజయవాడ వెళ్తోంది ఆ ప్రైవేటు బస్సు. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఒక మగ పిశాచి మేల్కొనే ఉంది. సభ్యతను మరిచి తోటి మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆ మహిళ వెంటనే ‘దిశ’ యాప్‌ నుంచి సమాచారం పంపింది. సరిగ్గా ఆరు నిముషాల్లో పోలీసులు వచ్చి, అతడిని తమతో తీసుకుపోయారు. ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 8న దిశ యాప్‌ను ప్రారంభించింది. ఏపీ మహిళకు లభించిన దిశ.. ఆమె చొరవకు ప్రేరణ ఇచ్చింది.

స్వతంత్రం

మన చేతుల్లోనే
జీవితం ఎప్పుడు ఎలా పరుగులు తీయమని ఆదేశిస్తుందో చెప్పలేం. అందుకే డ్రైవింగ్‌ తెలిసి ఉండాలి. ఆడపిల్లకు ధైర్యమెంత ముఖ్యమో డ్రైవింగ్‌ అంత ముఖ్యం. ఫిబ్రవరి 21న ఒక యువతి ఊబర్‌ క్యాబ్‌లో వెళుతోంది. 28 ఏళ్ల యువతి. ముంబై నుంచి పుణెకు బుక్‌ చేసుకుంది. క్యాబ్‌లో కూర్చుంది. కొన్ని కిలోమీటర్ల తర్వాత క్యాబ్‌ మూవ్‌మెంట్‌లో ఏదో తేడా కనిపించింది ఆమెకు. డ్రైవర్‌ని చూసింది. కునికిపాట్లు పడుతూ డ్రైవ్‌ చేస్తున్నాడు. క్యాబ్‌ని ఓ పక్కకు తీసుకుని ఆపమంది. ఆపాడు. ‘నువ్వు వెనక కూర్చో, నేను ముందు కూర్చుంటా’ అంది. ముందంటే స్టీరింగ్‌ సీట్లో! ఆ క్యాబ్‌ డ్రైవర్‌కి నిద్ర లేదట. పుణె చేరాక దిగి అతడి స్టీరింగ్‌ని అతడి చేతికిచ్చి ఆ యువతి వెళ్లిపోయింది. తర్వాత ఊబర్‌ ఆమెకు సారీ చెప్పింది. లైఫ్‌లో మనల్ని డ్రైవ్‌ చేయడానికి చుట్టూ ఎంతోమంది ఉండొచ్చు. మనకూ డ్రైవింగ్‌ వచ్చి ఉండాలని ఈ ముంబై అమ్మాయి తేజస్వినీ దివ్యా నాయక్‌ అమ్మాయిలకు సందేశం ఇచ్చిందనే అనుకోవాలి.

ఆదర్శం

ఐఎఎస్‌ డెలివరీ
బిడ్డ అడ్డం తిరిగిందో, బిడ్డ మెడకు పేగే చుట్టుకుందో.. సిజేరియన్‌ చేయాలన్నారు. ఆమెకది రెండో కాన్పు. మొదటి కాన్పు నార్మల్‌. రెండో కాన్పు అబ్‌నార్మల్‌. సిజేరియన్‌ తప్పదు. అలాంటప్పుడు జాగ్రత్త కోసం మామూలు వాళ్లు కూడా  ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తారు. పైగా ఆమె ఐఎఎస్‌ ఆఫీసర్‌. డిప్యూటీ కమిషనర్‌. ప్రైవేటు ఆసుపత్రి అక్కర్లేదు. ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్తాను అంది! చకచకా ఏర్పాట్లు చేసి, బిడ్డను బయటికి తీశారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. మగ బిడ్డ. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమం. విషయం తెలిసి జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రభుత్వాసుపత్రులలో వైద్య సదుపాయాలు సరిగా ఉండవు అనే దురభిప్రాయాన్ని మీరు పోగొట్టారు’’ అని అభినందించారు. ఆ తల్లి పేరు కిరణ్‌ పసి. జార్ఖండ్‌ లో గొడ్డా ప్రాంత పాలనాధికారి. ఏదైనా మహిళలే చేయగలరు. ప్రాణాలతో పని. అయినా ప్రైవేట్‌ ఆసుపత్రితో నాకేం పని అనుకున్నారు పసి.

స్వేచ్ఛ

అర్ధరాత్రి నిర్భయంగా
మహిళా దినోత్సవం సందర్భంగా పంజాబ్‌ ప్రభుత్వం మార్చి ఏడు సాయంత్రం 7 గంటల నుంచి, అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు పంజాబ్‌లోని ప్రతి జిల్లా కేంద్రంలో, ముఖ్య పట్టణాల్లో ప్రధాన రహదారులను మూసేయబోతోంది. అంటే మహిళల కోసం తెరవబోతోంది. ఇక ఆ దారిలో పురుషులకు.. వాళ్లు బాలురే అయినా.. ఆ కొన్ని గంటలూ నో ఎంట్రీ. వాహనాలు కూడా బంద్‌. కేవలం మహిళలు, యువతలు, బాలికలు మాత్రం ఆ రాత్రి ఆ రోడ్ల మీదకు వస్తారు. స్వేచ్ఛగా నడుస్తారు. పరుగులు తీస్తారు. సైక్లింగ్‌ చేస్తారు. ఆటలు ఆడతారు. పాటలు పాడతారు. ఫ్లాష్‌ డాన్స్‌ చేస్తారు. సాయంత్రాలు ఎలా ఉంటాయో తెలియని ఆడపిల్లలకు.. రాత్రి ఎలా ఉంటుందో చూపించబోతోంది పంజాబ్‌. చూపిస్తే ఏం వస్తుంది? లేట్‌ నైట్‌ డ్యూటీలు ఉండే ఉద్యోగాలు చేయడానికి ప్రోత్సాహం వస్తుంది. అయినా ఒక్కరోజుతో ఏమౌతుంది అంటారా! ఒక్క అడుగుతో ఏమౌతుంది అన్నట్లుంది. ఆ ఒక్క అడుగు వేయకుండానే మన అమ్మాయిలు 29,029 అడుగుల ఎత్తుకు చేరుకున్నారంటారా! ఎవరెస్టుపై జెండా ఎగరేసి వచ్చారంటారా!

సంయమనం

విరుపుపై గెలుపు
గ్రెటా థన్‌బర్గ్‌ మీద ఆయిల్‌ కంపెనీలకు పీకల్దాకా ఉంది. ఉన్నా ఏం చేయగలవు? మంచి విషయమే చెబుతోంది ఆ స్వీడన్‌ అమ్మాయి. ‘భూగోళంపై కాలుష్యం పెరిగిపోతోంది. కొంచెం బాధ్యతగా బిహేవ్‌ చెయ్యండి’ అని. అయితే.. ఒక టీనేజ్‌ ఎలుక.. సింహం లాంటి మాకు చెప్పడం ఏమిటని కెనడాలోని ఎక్స్‌–సైట్‌ ఎనర్జీ సర్వీసెస్‌ అనే ఆయిల్‌ కంపెనీ ఆమె పై కార్టూన్‌ గీయించి, దాన్ని స్టిక్కర్‌గా వేయించింది. నవ్వు తెప్పించే కార్టూన్‌ కాదు అది.  ఆ అమ్మాయి ఒంటి మీద బట్టల్లేకుండా చేసి, రెండు జడలు పట్టుకుని లాగుతున్న కార్టూన్‌ స్టిక్కర్‌!  కానీ గ్రెటా బాధపడలేదు! ‘‘మనం గెలిచాం’’ అంది. ‘‘మన ఉద్యమాన్ని ఎదుర్కోలేక, మనల్ని వ్యక్తిగతంగా కించపరుస్తున్నారంటే మనం గెలిచామనే’’ అని  ట్వీట్‌ చేసింది. దెబ్బకి ఆయిల్‌ కంపెనీ ముఖం మాడిపోయింది. దిగొచ్చి అపాలజీ చెప్పింది. స్టిక్కర్‌లను వెనక్కు తీసేసుకుంది. యోధురాలి మౌనానికీ శక్తి ఉంటుంది.

సమరం

ఏడడుగుల దూరం
‘మీటూ’ మూవ్‌మెంట్‌ వచ్చిన మొదట్లో మగవాళ్లు జోకులేశారు. అయితే ఇదేదో సీరియస్‌ వ్యవహారమేనని తెలుసుకోడానికి వారికి ఇంతకాలం పట్టినట్లుంది. హాలీవుడ్‌లో మీటూ నిందితుడు హార్వీ వైన్‌స్టీన్‌ మొత్తానికి అరెస్ట్‌ అయ్యాడు. మన బాలీవుడ్‌లో, తక్కిన దక్షిణాది ఉడ్‌లలో కూడా మీటూ మార్చింగ్‌ నడుస్తూనే ఉంది. దోషులు ఎలాగూ ఇవాళ కాకపోతే రేపు కలుగుల్లోంచి బయటికి వస్తారు. నటి కాజోల్‌ కూడా ఇదే మాట అంటున్నారు. ‘‘ఒకటి గమనించారా! మగవాళ్లెవరూ ఇప్పుడు.. వాళ్లు మంచివాళ్లయినా, చెడ్డవాళ్లయినా, ఆడవాళ్లంటే అసలు పట్టనివాళ్లయినా.. ఎందుకైనా మంచిదని ఏడడుగులు వెనకే నడుస్తున్నారు. ఏడుసార్లు ఆలోచిస్తున్నారు. అంటే మీటూ సక్సెస్‌ అయిందనే కదా..’’ అని. ఆ మాట నిజమే. దోషికి శిక్షపడటం కన్న పెద్ద విజయం.. కొత్త దోషుల్ని తయారు కానివ్వకపోవడం. మీటూ సక్సెస్‌ కాదు, గ్రాండ్‌ సక్సెస్‌.

ఆత్మ గౌరవం

భర్తకన్నా ముఖ్యం
స్త్రీపై చెంపదెబ్బ చాలా తేలిగ్గా పడిపోతుంటుంది మన సమాజంలో. ఇంట్లో భార్యని భర్త, బయట ప్రేయసిని ప్రియుడు.. అదేదో తమ డ్యూటీలో భాగంగా కొట్టేసినట్లు కొట్టేస్తుంటారు. అదేమంటే చక్కదిద్దడానికి అంటారు. ఎవర్ని చక్కదిద్దడానికి, ఏం చక్కదిద్దడానికి? మగాడికి మాట్లాడ్డం చేత కానప్పుడే స్త్రీ చెంపమీదకి చెయ్యి లేస్తుంది. ‘అర్జున్‌రెడ్డి’లో హీరో అంత పెద్ద మగాడైనా ఏం చేశాడు.. ఆమెను చెంపదెబ్బ కొట్టాడు! ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్నవాడైతే చెయ్యి పైకి లేపేవాడా! ‘థప్పడ్‌’ స్క్రిప్టు విన్నప్పుడు, ‘థప్పడ్‌’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆ సినిమా కో–రైటర్‌ మృణ్మయిని కొందరు అడిగారు.. ‘స్టోరీ బాగా వీక్‌గా ఉందేమో, భార్యాభర్తలు విడిపోడానికి కేవలం ఒక చెంప దెబ్బ కారణం అన్నట్లు చూపిస్తున్నాం’ అని! మృణ్మయి ఆశ్చర్యపడ్డారు. భార్యను భర్త కొట్టే చెంపదెబ్బ ఎంత కామనైపోయిందీ అనుకున్నారు. ‘థప్పడ్‌లో భార్య తాప్సీ, భర్త తనను చెంప దెబ్బ కొట్టినందుకు విడాకుల వరకు వెళుతుంది. ‘ఇది మామూలు విషయమే కదా.. అంటే కాదు. ఇది నా ఆత్మగౌరవం అంటుంది’. భర్త దగ్గర భార్యకు ఆత్మగౌరవం ఏమిటి అనే పురుషోత్తములు కూడా సినిమా చూశాక.. భార్యకు భర్త కన్నా ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో అర్థం చేసుకునే విధంగా సినిమా ఉందని రివ్యూలు వస్తున్నారు. అనుభవ్‌ సిన్హా ఈ సినిమా దర్శకుడు. ఆయనతో కలిసే మృణ్మయి స్క్రిప్ట్‌ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement