సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంద శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్–19 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు. కోవిడ్–10 ప్రోటోకాల్స్ పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటించాలని చెప్పారు. శానిటైజేషన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంలో సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఏఐ) స్వాగతించాయి.
డిజిటల్‌కి గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం..
ఓటీటీల్లో విడుదలవుతున్న పలు వెబ్ సిరీస్‌లు, షోలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికలపై విడుదలయ్యే వెబ్‌సిరీస్‌లు, షోల నియంత్రణకు గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ‘‘ఓటీటీల్లో విడుదలవుతున్న కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే గైడ్‌లైన్స్ తీసుకొస్తాం’’ అని వెల్లడించారు.
నియమావళిలోని ముఖ్యాంశాలు
► కంటైన్‌మెంట్ జోన్లలోని థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శనకు అనుమతి లేదు.
► క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు చర్యలకు సిఫార్సు చేయొచ్చు.
► థియేటర్లలో సీట్ల సామర్థ్యం వందశాతానికి పెంచుకోవచ్చు.
► సినిమా హాళ్లు, థియేటర్లలో కోవిడ్–19 సంబంధిత భద్రతా చర్యలను అమలు చేయాలి.
► ఫేస్ మాస్కుల వినియోగం తప్పనిసరి.
► థియేటర్ల బయట, కామన్ ప్రాంతాలు, వేచిఉండే ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి.
► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.
► ఆరోగ్యసేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలి.
► ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో రద్దీ లేకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
► సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమాల ప్రదర్శనల మధ్య తగినంత విరామం ఇవ్వాలి.
► టికెట్లు, ఆహారం, పానీయాల కొనుగోలులో చెల్లింపుల నిమిత్తం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి.
► టికెట్ల కొనుగోలు నిమిత్తం రోజంతా తెరచి ఉండేలా తగిన సంఖ్యలో బాక్సాఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా ముందస్తు బుకింగ్‌ను అనుమతించాలి.
► థియేటర్ల ప్రాంగణంలో శానిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
► మానవ సంచారం ఉండే అన్ని చోట్లా హ్యాండిల్స్, రెయిలింగ్స్ తరచుగా శానిటైజ్ చేయాలి.
► థియేటర్లలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై ప్రకటనలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment