సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి నిధుల హామీలు పారిస్తున్నారు. తెలంగాణకు నిధులిచ్చేందుకు మాత్రం కేంద్రానికి మనసు రావడం లేదు’ అని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను ఆదుకుని, ప్రాధాన్యతా రంగాలకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తవుతున్నాయని, 70 దేశాల రాయబారులు ఇక్కడి జీనోమ్ వ్యాలీని సందర్శించారని.. ఇంత ప్రాముఖ్యత ఉన్న నగరానికి తగిన సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదేమని నిలదీశారు. బుధవారం శాసనసభలో మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులు.. సీఎం తరఫున ప్రభుత్వ రంగసంస్థలు, ఐఅండ్ పీఆర్ పద్దులపై కేటీఆర్ సమాధానమిచ్చారు.
వ్యాక్సిన్ ఇక్కడ.. బాట్లింగ్ అక్కడనా?: అంతర్జాతీయంగా మూడో వంతు వ్యాక్సిన్‌లు హైదరాబాద్‌లోనే తయారవుతుండగా.. 1,200 కిలోమీటర్ల దూరంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖసోలిలో వ్యాక్సిన్ బాట్లింగ్‌ను చేపడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నో విషయాల్లో దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ వరదల్లో మునిగిపోతే.. కేంద్రం నుంచి అందిన సాయం సున్నా అని విమర్శించారు. ‘‘104 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా వరదల బారినపడ్డ హైదరాబాద్‌కు రూ.1,350 కోట్ల తక్షణ సాయం అందించాలని సీఎం కేసీఆర్ లేఖ రాసినా కేంద్రం నుంచి ఒక్కపైసా రాలేదు.
ఐటీ, ఎయిరోస్పేస్, వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉన్న తెలంగాణకు రూ.832 కోట్లు అందించాలని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరికి లేఖ రాస్తే.. ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదంటూ తిరుగుటపా వచ్చింది. దేశాభివృద్ధిలో హైదరాబాద్ కు ఐదు శాతం జీడీపీ వాటా ఉన్నా.. కేంద్రం ఎందుకు తోడ్పాటు అందించడం లేదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్.. హైదరాబాద్ ఫార్మాసిటీ, బయోటెక్‌పార్క్, మెగా టెక్స్‌టైల్ తదితరాలపై రాష్ట్రం మొర ఆలకించడం లేదు.
విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై ఉలుకూ పలుకు లేదు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నా కూడా.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఎక్కడో ఉన్న బుందేల్‌ఖండ్‌కు తరలించారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు విస్తారంగా పండుతుంటే.. అక్కడ తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని ఎన్నికల హామీలిస్తారు. ఇవన్నీ చూస్తుంటే అసలు కేంద్రం ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు. ఎదుగుతున్న రాష్ట్రాన్ని వేరుగా చూడటం సరికాదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 30 వరకు ఆధార్ లింకేజీ పొడిగింపు
హైదరాబాద్‌లో 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు పొందేందుకు ఆధార్ లింకేజీ తప్పనిసరని, దీనికి తుది గడువును వచ్చేనెల 30 వరకు పొడిగించామని కేటీఆర్ చెప్పారు. ఉచిత నీటికి సంబంధించి ఏడాదికి రూ.480 కోట్లను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రస్తావించిన అంశాలపై ఆయన ఈ సమాధానాలు ఇచ్చారు. మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల పనులను 71 మున్సిపాలిటీల్లో మొదలుపెట్టగా 11 చోట్ల పూర్తయ్యాయని, మిగతా చోట్ల త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్ నగరానికి గత ఆరున్నరేళ్లలో వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాల కింద మొత్తం రూ.67,149.23 కోట్లు ఖర్చుచేసినట్టు వెల్లడించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేవించి.. ‘‘మీరు అక్కడే ఉంటారు. మేం ఇక్కడే ఉంటాం. అనుకున్నవన్నీ పూర్తి చేస్తాం. అనుమానం వద్దు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment