సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం చేపడుతున్న పనులపై కేంద్రం లేఖాస్త్రం సంధించింది. ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించి ఒక్కో అంశాన్ని ఆరా తీస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, పర్యావరణ అనుమతులు, వ్యయా లపై వరుసగా లేఖలు సంధిస్తున్న కేంద్రం, రెండ్రోజుల కిందట ఆయకట్టు వివరాలు కోరగా, తాజాగా గురువారం అదనపు టీఎంసీ పనులను గత పనులకు భిన్నంగా చేపట్టడంపై వివరణ కోరుతూ లేఖ రాసింది.
ఒక్కొక్కటిగా వివరాల సేకరణ...
కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్, గంధమల్ల, బస్వాపూర్, వాటి కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. రెండు టీఎంసీల తరలింపు పనులకు కేంద్రం రూ.80,190 కోట్లకు అనుమతులు ఇవ్వగా, ఇందులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ పనులు కొనసాగుతుండగానే, కృష్ణా బేసిన్‌లో నీరందని ప్రాంతాలకు సైతం కాళేశ్వరం ద్వారానే గోదావరి జలాలు అందించేలా అదనపు టీఎంసీ పనులు చేపడుతోంది. ఈ పనులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు సైతం దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. డీపీఆర్‌లపై బోర్డు, కేంద్రం రాసినా స్పందన లేకపోవడంతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేరుగా లేఖలు రాశారు. ఇందులో రెండు టీఎంసీల నీటిని తరలింపునకే కేంద్రం అనుమతి ఇచ్చిందని, అదనపు టీఎంసీ పనులకు అనుమతి లేదన్న అంశాన్ని లేవనెత్తారు. దీనికి కొత్తగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ మరో లేఖ రాయగా, అనంతరం ప్రాజెక్టుకు తొలుత నిర్ధారించిన అంచనా వ్యయం, సవరించిన అంచనా వ్యయాలు, ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలను సమర్పించాలని కోరింది. ఈ లేఖ రాసిన వారం రోజుల వ్యవధిలో మూడు రోజుల కిందటే తాము 98 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 195 టీఎంసీల ఎత్తిపోతలకు అనుమతిచ్చామని, దీనికి అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన చేశారో, లేదో తెలపాలని కోరుతూ లేఖ రాసింది. అదనపు టీఎంసీతో అదనంగా సాగులోకి వచ్చే ఆయకట్టు లేక స్థిరీకరణ ఆయకట్టు, జిల్లాల వారీగా ఆ ఆయకట్టు వివరాలు చెప్పాలని ఆదేశించింది.
దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. ఇది రాసిన రెండ్రోజులకే గురువారం మరో లేఖ రాసింది. ఇప్పటికే చేపట్టిన రెండు టీఎంసీల నీటి తరలింపునకు గ్రావిటీ కెనాల్, టన్నెళ్ల వ్యవస్థల ద్వారా నీటి తరలింపు చేపట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం అదనంగా టీఎంసీ నీటిని తీసుకునేందుకు చేపట్టిన పనులను మాత్రం పాత విధానంలో కాదని, పైప్‌లైన్ ద్వారా ప్రెషర్‌మెయిన్ వ్యవస్థ ఏర్పాటు చేసి తరలించడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. ప్రెషర్ మెయిన్ వ్యవస్థను ఎంచుకునేందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర వరుస లేఖల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్ని వివరాలను సేకరించి పెట్టుకుంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేక జాతీయ సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం (ఏఐబీపీ)లో చేర్చి ఆర్థికసాయం చేయాలని పదేపదే కోరుతున్నా స్పందించని కేంద్రం, అదనపు టీఎంసీ పనుల వివరాలపై లేఖలు రాయడం మాత్రం విస్మయానికి గురి చేస్తోందని జల వనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment