
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ నగరాల రేటింగ్స్‌లో అంబికాపూర్(ఛత్తీస్‌గఢ్), రాజ్‌కోట్, సూరత్ (గుజరాత్), మైసూర్(కర్ణాటక), ఇండోర్(మధ్యప్రదేశ్), నవీ ముంబై(మహారాష్ట్ర)లకు అత్యున్నత 5స్టార్ లభించింది. వ్యర్థాల(గార్బేజ్) నిర్వహణలో సమర్ధంగా వ్యవహరించినందుకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంగళవారం ఈ నగరాలకు ‘గార్బేజ్ ఫ్రీ నగరాలుగా’ అత్యుత్తమ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆరు నగరాలకు 5స్టార్, 65 నగరాలకు 3స్టార్, 70 నగరాలకు స్టార్ ప్రకటిస్తున్నట్లు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ తెలిపారు. కరోనాపై పోరులో స్వచ్ఛభారత్ మిషన్ గణనీయ పాత్ర పోషిస్తోందన్నారు. 2019–20 సంవత్సరానికి గానూ మొత్తం 1435 నగరాలు ఈ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, 141 నగరాలకు రేటింగ్స్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
3స్టార్‌లో న్యూఢిల్లీ
గార్బేజ్ ఫ్రీ నగరాలుగా 3 స్టార్ రేటింగ్ పొందిన వాటిలో న్యూఢిల్లీ, కర్నాల్(హరియాణా), చండీగఢ్, అహ్మదాబాద్(గుజరాత్), భోపాల్(మధ్యప్రదేశ్), జంషెడ్‌పూర్(జార్ఖండ్).. మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, రోహ్‌తక్(హరియాణా), గ్వాలియర్(మధ్యప్రదేశ్), వడోదర, భావ్‌నగర్(గుజరాత్)లకు 1 స్టార్ లభించింది. గత ఐదేళ్లుగా స్వచ్ఛభారత్ మిషన్ విజయవంతంగా కొనసాగడం వల్లనే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని పురి చెప్పారు. ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను ప్రారంభించిందని, దీని వల్ల నగరాల మధ్య స్వచ్ఛత విషయంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొందన్నారు. 1.19 కోట్ల మంది పౌరుల నుంచి సమాచారం సేకరించామని, 10 లక్షల జియోట్యాగ్‌డ్ ఫొటోలను పరిశీలించామని, 5175 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తమ క్షేత్రస్థాయి పర్యవేక్షకులు సందర్శించారని మంత్రి వివరించారు.
రేటింగ్స్ పొందిన ఆంధ్రప్రదేశ్ నగరాల
3స్టార్: తిరుపతి, విజయవాడ
1స్టార్: విశాఖపట్నం, పలమనేరు(చిత్తూరు జిల్లా), చీరాల(ప్రకాశం జిల్లా), సత్తెనపల్లి(గుంటూరు జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment